Top 5 This Week

Related Posts

సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: మంత్రి పొంగులేటి

ఖమ్మం: డబ్బు సంపాదించడం కోసం ప్రజా ప్రతినిధులు ఎవరు రాజకీయంలోకి రాలేదని, ఫలానా నాయకుని హయంలో మా ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని ప్రజల మన్ననలు పొందేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన నూతన సర్పంచుల, మునిసిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ల, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్ ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు అవి చేరేలా చూడాలన్నారు.

సర్పంచ్ నుంచి కలెక్టర్ వరకు ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు మనకు అందించారని, మనం అధికారంలో ఉన్న సమయంలో గ్రామంలో మంచి అభివృద్ధి జరిగిందని, మంచి పనులు జరిగాయనే మంచి పేరు సంపాదించాలని తాపత్రయపడదామని మంత్రి పేర్కొన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై నేడు ఉందన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సమయం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మంచి మార్పు కనిపిస్తుందన్నారు.

పాలక వర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, గత నెలన్నర కాలంలో పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయని, మార్చి 31 లోపు మరిన్ని నిధులు విడుదల అవుతాయని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు నిధులు విడుదల అయ్యాయని, ఈ నిధులు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలన్నారు. చట్ట పరిధిలో నిధులను సద్వినియోగం చేయాలని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కాపలాదారుగా ఉండాలన్నారు.

పేద ప్రజలకు నిరంతరం మంచి చేసే విధంగా, రాజకీయాలకతీతంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ప్రస్తుతం గెలిచిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. ప్రతి ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా తన సహకారం ఉంటుందన్నారు.

రాబోయే వేసవిలో తాగునీటి సమస్య ఏ గ్రామంలో లేకుండా ఉండే విధంగా అధికారులు, నూతన ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామ పంచాయతీకి విడుదలైన నిధులు సద్వినియోగం అయ్యే విధంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు తెలిపారు. గ్రామాలలో సమస్యలు కేవలం డబ్బుతో మాత్రమే పరిష్కారం కావన్నారు. సిసి రోడ్ల, డ్రైయిన్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టడం చాలా కీలకమన్నారు. గ్రామాలలో నిర్మించే నూతన రోడ్లు, డ్రైయిన్ సమయంలో అధికారులు ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ అధికంగా ఉండాలని, ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.

ప్రజలతో నిరంతరం ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటూ సమయస్ఫూర్తితో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. నేటి శిక్షణ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు సరిగ్గా వినియోగించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి, జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Popular Articles