Top 5 This Week

Related Posts

మన ధాన్యం విదేశాలకు ఎగుమతి: మంత్రి పొంగులేటి

తెలంగాణా రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు వరి పంటపై నియంత్రణ పెట్టాయని, ప్రజా ప్రభుత్వంలో మన రైతులు పండించిన ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు భరోసా పెండింగ్ నిధులను త్వరలో రైతుల ఖాతాలలో జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో నీటి సమస్య రాకుండా రైతుల పొలాలకు సాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.

రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి చెప్పారు. గురువారం మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గంగమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించామని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. గడిచిన సంవత్సర కాలంలో 25 లక్షల 65 వేల మంది రైతన్నలకు 20 వేల 687 కోట్ల రూపాయలతో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామన్నారు.

వరి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన రైతు బంధు నిధులను ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దేశ చరిత్రలో మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. గత వానాకాలం పంటకు దాదాపు 1700 కోట్ల రూపాయలు బోనస్ అందించామన్నారు. యాసంగిలో కూడా సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.

గత వానాకాలం పంట సమయంలో రికార్డు స్థాయిలో వరి పంట పండిందని అన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వానాకాలం, యాసంగి ధాన్యం మన రాష్ట్రంలో పండుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతన్నల దగ్గర నుంచి పంట కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు అనవసర ఆందోళనకు గురి కావద్దని అన్నారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, అడిషనల్ డిఆర్డీవో నూరొద్దీన్, తహసీల్దార్ కరుణశ్రీ, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles