భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విలాసవంతమైన టయోటా ఫార్చూనర్ వాహనాన్ని కొనుగోలు చేశారు.ఇందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా? ఈ కారును స్వయంగా నడుపుతూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందులో కాసేపు షికారు చేయడమే అసలు విశేషం. మంత్రి పొంగులేటి ప్రియశిష్యుల్లో ఒకరిగా ప్రాచుర్యం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టయోటా ఫార్చూనర్ కారును కొనుగోలు చేసిన సంబురంలో మంత్రి కూడా పాలు పంచుకున్నారు.

ఇందులో భాగంగానే పాయం కారును మంత్రి పొంగులేటి చేత రోడ్డుపైకి తీసుకువచ్చారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి ఆదివారం ఉదయం ఫార్చూనర్ ను తీసుకురాగా, కారును స్టార్ట్ చేసిన పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి స్వయంగా నడుపుతూ ఎన్టీఆర్ సర్కిల్ వరకు వెళ్లారు. అక్కడి నుంచి తన కాన్వాయ్ తో మంత్రి పొంగులేటి ఇల్లెందు పర్యటనకు వెళ్లారు. కారు దిగిన తర్వాత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు మంత్రి శుభాకాంక్షలు చెప్పారు.