రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే అభ్యర్థులను దీవించాలని రెవెన్యూ మంత్రి తెలంగాణా రాష్ట్ర ప్రజలను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోకవర్గంలో పర్యటించిన మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లల్లో చేయని పనులను ఇందిరమ్మ ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపిందని చెప్పారు.
పేద ప్రజల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. దీనిలో భాగంగా పినపాక గిరిజన నియోజకవర్గం కావడంతో 1,000 అదనపు ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా ప్రతి సోమవారం నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వంలో పదేళ్లల్లో రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 10 నెలల్లోనే రూ. 21 వేల కోట్ల రూపాయలను రైతులకు రుణ మాఫీ చేసి చూపిందన్నారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు నిధులను జమ చేస్తన్నట్లు చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో అర్హులందరి ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నారు. ఉచిత విద్యుత్, రూ. 500 కే గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పేదల సంక్షేమానికి పెద్దపీట ఇందిరమ్మ ప్రభుత్వం వేస్తున్నదని చెప్పారు. విద్యారర్థులకు 40 శాతం మెస్ ఛార్జీలు, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు.

పినపాక నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటిడిఎ పీఓ రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లతో కలిసి గుండాల మండలం జగ్గుతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మామకన్నులో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. విప్పలగుంపులో పీఆర్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీడిఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఆళ్లపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

