సంక్షేమం, అభివృద్ధిలతో రాష్ట్రంలో జోడెడ్ల ప్రజా ప్రభుత్వ పాలన సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామం, మండలంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే, అభివృద్ధి పనులు సైతం చేపట్టామని, పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో మంత్రి శనివారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధిలకు ప్రాధాన్యత నిస్తూ పాలన సాగిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా నిరుపేదలకు ఉగాది నుండి సన్న బియ్యం సరఫరా చేస్తున్నదని, ఇందిరమ్మ కమిటి అందించిన జాబితా ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో నిరుపేదలకు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని, యాసంగి సీజన్ లో కూడా రైతులకు బోనస్ చెల్లిస్తామన్నారు. రైతుల భూ సమస్యలను అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి పరిష్కరించే దిశగా భూ భారతి చట్టం ద్వారా చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద పేద కుటుంబానికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామన్నారు. పేదల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.

రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గ్రామీణ నిరుపేదలకు ఇచ్చిన భరోసా ప్రకారం చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఇచ్చిన ప్రతి మాటను పేదవానికి చేర్చడానికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రి తన పర్యటనలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, హాస్సింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఏడిఏ సరిత, తిరుమలాయపాలెం తహసీల్దార్ లూథర్స్ విల్సన్, ఎంపిడివో సిలార్ సాహెబ్, కూసుమంచి మండల తహశీల్దార్ కరుణశ్రీ, ఎంపిడివో వేణుగోపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.