Top 5 This Week

Related Posts

చర్చనీయాంశంగా దయాకర్ రెడ్డి బర్త్ డే వేడుకలు

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజకీయ చర్చనీయాంశంగా మారాయి. మంత్రి క్యాంపు కార్యాలయంగా వ్యవహరిస్తున్న ఖమ్మంలోని పొంగులేటి నివాసం కేంద్రంగా దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన సందడి తీవ్రత ఈ చర్చకు కారణంగా భావించవచ్చు. గతంలో కనీ, వినీ ఎరుగని రీతిలో దయాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈసారి అత్యంత అట్టహాసంగా జరిగాయి.

దయాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులోనేగాక, అనేక ప్రధాన వీధుల్లో భారీ హోర్డింగులను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఆయా హోర్డింగ్ ల ప్రదర్శన ప్రముఖ రాజకీయ నాయకుల స్థాయికి తీసిపోని విధంగా ఉండడం మరో ప్రత్యేకత. అంతేకాదు దయాకర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం నుంచే కాదు దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి దాదాపు 1,600 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఖమ్మానికి తరలివచ్చారు. ఉదయం పదిన్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాయలయం దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలతో దద్దరిల్లింది. వివిధ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానంతో పొంగులేటి క్యాంపు ఆఫీసులో దయాకర్ రెడ్డి చేత కట్ చేయించిన కేకుల సంఖ్య సుమారుగా 300 పైచిలుకు అంటే అతిశయోక్తి కాదు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కళ్లు, చెవులు, ముక్కుగా నాయకులు కార్యకర్తలు అభివర్ణించే దయాకర్ రెడ్డి బర్త్ డే ఈసారి జరిగిన తీరు ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని కల్పించడం మరో విశేషం. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బంధువైన దయాకర్ రెడ్డి బర్త్ డే సందడి దృశ్యాలు మరోవైపు రాజకీయంగానూ భిన్న చర్చకు దారి తీశాయి.

Popular Articles