Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఖమ్మానికి ధీటుగా కూసుమంచి అభివృద్ధి: మంత్రి పొంగులేటి

ఖమ్మం నగరానికి ధీటుగా కూసుమంచి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి గురువారం మంత్రి పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా పలు రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.

అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కూసుమంచి, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో 6 కోట్ల 50 లక్షల రూపాయలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్స్, జంక్షన్ అభివృద్ధి పనులు కొద్ది నెలల్లో పూర్తి చేస్తామని, ఖమ్మం నగరానికి ధీటుగా కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ ను తయారు చేస్తామని చెప్పారు. కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంతర్గత రోడ్లు నిర్మించామని, తాగునీటి సరఫరా సమస్యలు పరిష్కరించామని, 50 లక్షల రూపాయలతో షాదీ ఖానా మంజూరు చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో మంజూరు చేశామని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు.

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గత 18 నెలల కాలంలో సుమారు 1,400 నుంచి 1,500 కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేసుకున్నామని తెలిపారు. ప్రజల దీవెనలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడినందున ఇంత అభివృద్ధి సాధ్యమవుతోందని మంత్రి పేర్కొన్నారు. గత పాలకులు అమలు చేసిన సంక్షేమం కొనసాగిస్తూ 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ హాస్టల్స్ లలో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్స్ చార్జిలు 200 శాతం పెంచామని, రైతులకు 21 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల రుణ మాఫీ చేశామని అన్నారు.

గత ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సహాయం ఎకరానికి 10 వేల రూపాయలు అందిస్తే, ప్రజా ప్రభుత్వం రైతులకు అందించే సహాయం 12 వేలకు పెంచి, 9 రోజుల వ్యవధిలో దాదాపు 9 వేల కోట్ల రూపాయ లను రైతు భరోసా నిధులు జమ చేసామని అన్నారు. ప్రతి గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తుందని అన్నారు. రాబోయే మూడున్నర సంవత్సరాలలో మరో 3 విడతల్లో అర్హులైన పేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

Popular Articles