Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘టైటిల్’ సమస్యలను తీర్చేయత్నం: కేటీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తులపైన ఉన్న టైటిల్ హక్కుల సంబంధిత సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కసరత్తు ప్రారంభమైందన్నారు. ఈ మేరకు ఈరోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల పరిధిలోని పురపాలక సంఘాల వారిగా రెవెన్యూ సమస్యల పైన మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల వారీగా హాజరయ్యారు.

గ్రామాల కన్నా పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తులకు సంబంధించిన టైటిల్ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించామన్నారు. అయినప్పటికీ కొన్ని కారణాల వలన సమస్యలు పరిష్కారం కానీ కేసుల పైన ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం మున్సిపాలిటీలోని పేద ప్రజలకు పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకోబోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంచు భూమిని ప్రభుత్వ రికార్డులకి ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకi ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలన్నారు. తమ ఆస్తులపైన హక్కులకు భద్రత కలిగించే ప్రభుత్వ కార్యాచరణకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 15 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులను ధరణి వెబ్ సైట్ లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ధరణి వెబ్సైట్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సమావేశానికి హాజరైన మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.

దీంతో పాటు పట్టణాల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సంబంధిత సమస్యలను సేకరించి ఇవ్వాలని సూచించారు. ఈ కాలనీలో ఇలాంటి భూ సంబంధిత సమస్య వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వారి యొక్క సంఖ్య ఎంత ఉంటుంది, వారికి కావాల్సిన పరిష్కారం ఏమిటి వంటి వివరాలను తనకు అందించే సమాచారంలో సూచించాలని కోరారు. ఇలాంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం అందించే విధంగా నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వారి వారి ఆస్తులకి సంపూర్ణ హక్కులు పొందేలా చేసి భవిష్యత్తులో క్రయవిక్రయాలకు ఎలాంటి సమస్యలు ఉండకుండా చూస్తామన్నారు.

ఫొటో: రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించిన చిత్రం

Popular Articles