Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

కొండా సురేఖ పదవి భద్రమేనా? అసలేం జరుగుతోంది!?

హైదరాబాద్: విధుల నుంచి తొలగించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వివాదంలో తాజా కబురేమిటి? సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల పరిణామాలు ఏ మలుపును తీసుకుంటున్నాయి? హన్మకొండలోని రాంనగర్ లో గల మంత్రి నివాసం వద్ద పోలీసు భద్రతను తొలగించారట! హైదరాబాద్ లో కూడా మంత్రి సురేఖ ప్రభుత్వ వాహనాన్ని వదిలేశారట! సెక్యూరిటీ కూడా లేకుండానే సురేఖతోపాటు ఆమె కూతురు సుస్మిత ప్రయివేట్ వాహనంలో సంచరిస్తున్నారట! డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వద్దకు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ వద్దకు కూడా ప్రయివేట్ వాహనంలోనే, సెక్యూరిటీ లేకుండా తల్లీ, కూతుళ్లు వెళ్లారట! ఇదీ తాజా సమాచారం. ఇదేమీ ధ్రువపడిన సమాచారం కాదు సుమీ.

ఇదే అంశంపై హైదరాబాద్ లోని ప్రముఖ ఛానల్ లో పనిచేసే ఓ జర్నలిస్ట్ మిత్రుడేమంటారంటే.. ‘అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు సర్. కాస్త ముందూ, వెనుకా దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్ లో ఒకే సారాంశంతో కూడిన పాయింట్స్ తో ఈ వివాదంపై స్క్రోలింగ్స్ వస్తున్నాయి.. జర్నలిజం ఎటుపోతోందో తెలియడం లేదు. ఒకరి వెంట మరొకరు.. వాళ్ల వెనుక మనం.. మన వెనుక వాళ్లు.. ఇలా సాగుతోంది జర్నలిజం. ఏ ఒక్క అంశానికీ కన్ఫర్మేషన్ లేదు సర్’ ఇదీ ఆ మిత్రుడు చెప్పిన అసలు విషయం.

హన్మకొండలోని మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద పోలీసు భద్రత ఉన్నప్పటి తాజా దృశ్యం

అయితే ఒక్కటి స్పష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కొండా సురేఖ హాజరు కాలేదు. ఆమె గైర్హాజరు పరిణామాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. గత రాత్రి జూబ్లీ హిల్స్ లోని మంత్రి సురేఖ ఇంటి వద్ద చోటు చేసుకున్న హైడ్రామాపై కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ ఇంటికి వచ్చారని, తమనెందుకు టార్గెట్ చేస్తారని వ్యాఖ్యానించారు. రేవంత్ సీఎం కావాలని కోరుకున్నవారిలో తానూ ఉన్నానని కొండా మురళి చెప్పుకొచ్చారు. మంత్రి సురేఖ భర్త కొండా మురళి తాజా స్వరంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే కొండా దంపతుల పుత్రిక సుస్మిత మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల పేర్లు ప్రస్తావిస్తూ ‘రెడ్లు’ తమను తొక్కేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరినీ వదల్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మానుకోట, డోర్నకల్, పాలకుర్తి ఎమ్మెల్యేలు మాత్రమే కొండా ఫ్యామిలీ ఆరోపణల నుంచి ప్రస్తుతానికి మినహాయింపుగా ఉన్నారనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. కాగా మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వాడినట్లు వార్తల్లోకి వచ్చిన తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై సుస్మిత చేసిన వ్యాఖ్యలూ తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి.

గత రాత్రి సుమంత్ కోసం మంత్రి నివాసానికి వచ్చిన మఫ్టీ పోలీసుతో కొండా సుస్మిత వాగ్వాదం

ఈ నేపథ్యంలో కొండా సురేఖ మంత్రి పదవిపై సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. సోషల్ మీడియా సంగతి ఎలా ఉన్నప్పటికీ, హన్మకొండ రాంనగర్ లోని మంత్రి నివాసం వద్ద భద్రత తొలగింపు వాస్తవమే అయితే, హైదరాబాద్ లో అధికారిక వాహనాన్ని కాకుండా ప్రయివేట్ కారులో పయనించడం నిజమే అయితే.. భద్రతా సిబ్బంది లేకుండా కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మితలు ప్రయాణించడం సైతం ధ్రువపడితే.. అసలేం జరుగుతోంది? అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. అది ఏ స్థాయి ప్రశ్న అంటే ఈ వివాదపు పరిణామాల్లో కొండా సురేఖ మంత్రి పదవి భద్రమేనా? అనే వరకు. అర్థరాత్రి తమ ఇంటికి వచ్చిన పోలీసులతో కొండా సురేఖ తనయ సుస్మిత వాగ్వాదపు పంచాయతీ చివరికి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి..

కాగా మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద సెక్యూరిటీ తొలగింపు అవాస్తవమని ఆమె కార్యాలయ వర్గాలు సోషల్ మీడియ వేదికగా ప్రకటించాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద సెక్యూరిటీని తొలగించారంటూ వార్తలు వస్తున్నాయని, కొంత మంది సోషల్ మీడియాలో చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం నమ్మవద్దని ఆ వర్గాలు విజ్ఞప్తి చేయడం గమనార్హం.

Popular Articles