Top 5 This Week

Related Posts

తెలుగు మీడియా అత్యుత్సాహం ‘కత’!

దాదాపు మూడున్నర దశాబ్ధాల క్రితం.. 1990వ దశకంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బుగ్గారం నియోజవర్గం ఎమ్మెల్యేగా జువ్వాడి రత్నాకర్ రావు అనే ప్రముఖ నాయకుడు ఉండేవారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రత్నాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అప్పట్లో ఓ ప్రముఖ పత్రిక విషాదకర వార్తను ప్రచురించింది. బుగ్గారం ఎమ్మెల్యే రత్నాకర్ రావు మృతి చెందారనేది ఆయా వార్తా కథనపు సారాంశం. కానీ రత్నాకర్ రావు నిక్షేపంగానే ఉన్నారు. ఇంకేముంది రత్నాకర్ రావు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ లోని ఆ పత్రిక కేంద్ర కార్యాలయానికి ఫోన్లు చేసి చెడా మడా వాయించేశారు. కానీ అప్పటికే ఆ పత్రిక ప్రతులు జనంలోకి వెళ్లిపోయాయి. పత్రిక యాజమాన్యం చేయగలిగిందేమీ లేదు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు ట్విస్టు..

పత్రికలో వార్త ప్రచురితమైన రోజే కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించారు. బుగ్గారం ఎమ్మెల్యే రత్నాకర్ రావు చనిపోయినట్లు ఆ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తను జెడ్పీ సమావేశం ఏకగ్రీవంగా ఖండించింది. నిరసన తెలిపింది. కానీ అదే పత్రికలో మరుసటిరోజు వచ్చిన వార్తా కథనపు కంటెంట్ ఏంటో తెలుసా? ‘రత్నాకర్ రావు మృతికి జెడ్పీ సమావేశం సంతాపం తెలిపింది’ అనే సారాంశంతో మరో వార్త ప్రచురించడమే అసలు విషాదం. సరే ఆ పత్రిక తీరుతెన్నులపై విలేకరుల సమావేశంలో రత్నాకర్ రావు తరచుగా ప్రస్తావిస్తూ నవ్వుతూనే సరదాగా, హుందాగా సెటైర్లు వేసేవారనేది వేరే విషయం.

అప్పట్లో పత్రికలకు వార్తలను విలేకరులు ‘టెలీ ప్రింటర్ల’ ద్వారా పంపేవారు. తెలుగు పదాలను ఇంగ్లీషులో టైపు చేస్తే సబ్ ఎడిటర్లు తిరిగి తెలుగులో రాసుకునేవారన్నమాట. సరైన కమ్యునికేషన్ లేకనో, తర్జుమాలో సబ్ ఎడిటర్ల నిర్లక్ష్యం వల్లనో, టెలీప్రింటర్ రబ్బర్ ఇంక్ లేకపోవడం వల్లనో అప్పట్లో పత్రికల్లో ఇటువంటి ‘బ్లండర్స్’ ప్రచురితమయ్యేవని భావించేవారు. నాయకులు కూడా సీరియస్ గా తీసుకునేవారు కాదు. అందులోనూ జువ్వాడి రత్నాకర్ రావు మీడియా పట్ల ఎంతో గౌరవంగా ఉండేవారు. అది గతకాలపు మీడియా తీరు.. కానీ ఇప్పటి మీడియాకు ఏమైంది? ఇదీ అసలు చర్చ. విషయమేమిటంటే..

ఓ మీడియా సంస్థ థంబ్ నెయిల్ (ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతోంది)

బీఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆరోగ్యం నిన్న విషమించిన సంగతి తెలిసిందే. ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ అసుపత్రిలో ఐసీయూలో చికత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ నిన్న మన తెలుగు మీడియాకు చెందిన అనేక సంస్థలు ప్రదర్శించిన అత్యుత్సాహం జనంలో నవ్వులపాలు చేసింది. బతికున్న ఎమ్మెల్యే గోపీనాథ్ ను తెలుగు మీడియాకు చెందిన అనేక ఛానళ్లు చంపేశాయి. ఆయన చనిపోయినట్లు వార్తలను ప్రసారం చేయడమే కాదు, యూ ట్యూబుల్లోనూ వార్తా కథనాలను అప్ లోడ్ చేసి లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయడమే అసలు విషాదం.

ఈ అంశంలో ఫలానా ఛానల్ మినహాయింపు అనేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దాదాపు 99 శాతం తెలుగు మీడియా ఛానళ్లు పోటీలు పడి మరీ గోపీనాథ్ చనిపోయినట్లు వార్తలను ప్రసారం చేశాయి. మూడున్నర దశాబ్ధాల క్రితం జువ్వాడి రత్నాకర్ రావు ఘటన సందర్భంలో సరైన కమ్యునికేషన్ లేక పొరపాటుగానో, గ్రహపాటుగానో తప్పుడు వార్త జనంలోకి వెళ్లిందంటే అర్థం చేసుకోవోచ్చు. కానీ ఇప్పటి మీడియాకేమైంది..? మొబైల్ నెట్ వర్క్, బోలెడంత రిపోర్టింగ్ మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ బతికున్న ఎమ్మెల్యేను చనిపోయినట్లు వార్తలు ప్రచురించడం, ఆ తర్వాత నాలుక కరుచుకుని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియోలను ప్రయివేట్ లోకి మార్చడం.. ఇదీ నిన్న తెలుగు మీడియాకు చెందిన అనేక ఛానళ్లు పడిన అపసోపాలు..

ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందనే ప్రశ్నకు వస్తే.. ఇది పోటీ ప్రపంచం.. అందరికన్నా ముందుండాలనే తపనతో ఏదో ఒక ఛానల్ ‘బ్రేకింగ్’ అంటూ వార్త ప్రసారం చేస్తే.., అరెరె.. మనం వెనుకబడి పోయామే.. మనమూ చంపేస్తే పోలా..? అని మిగతా ఛానళ్లు ఆ వార్తను అనుసరించడమే నేటి వేగవంతమైన జర్నలిజపు పోకడ. తమకు రిపోర్టర్ ఉన్నాడనే విషయాన్ని మరిచి, కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలనే సోయి కూడా లేకుండా ‘స్క్రోలింగ్’ సెక్షన్ లో ‘బిగ్ బ్రేకింగ్’కు ఆదేశాలు ఇవ్వడమే అసలు కారణమని జర్నలిస్టు వర్గాలు చెబుతుంటాయి. ఈ ‘పోటీ పైత్యం’ వదలనంతకాలం మన మీడియా బతికున్నవాళ్లను ఇంకా ఎంతమందినైనా చంపేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

Popular Articles