మేడారం: మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే మండమెలిగే పండుగను బుధవారం నిర్వహించారు. మండమెలిగే ప్రక్రియ ద్వారా జాతర మొదలైనట్లుగానే ఆదివాసీలు భావిస్తారు. అయితే ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా జాతర జరుగుతుంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలు వనం నుంచి వచ్చి గద్దెలపై ఆసీనులయ్యేది ఆయా తేదీల్లోనే కావడం గమనార్హం.
అయితే మండమెలిగే పండుగలో భాగంగా సరిగ్గా వారం ముందు ఆదివాసీ పూజారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. వనదేవతలు కొలువైన ప్రాంతాల్లో పుట్ట మట్టితో అలికి, మామిడి తోరణాలు కడతారు. మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఆదివాసీ ఆడబిడ్డలు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు, గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు, పూజలు నిర్వహించి బూరుగు కొమ్మలతో దిష్టి తోరణాలు కట్టారు.
ఆదివాసీ ఆచారాలు, సంప్రదాయం ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. బుధవారం నిర్వహించిన మండమెలిగే పండుగ ప్రక్రియలోని దృశ్యాలు ఇవే:







