మేడారం: మేడారం జాతర శనివారం ముగిసింది. సమ్మక్క-సారలమ్మ దేవతలు జనం నుంచి వనంలోకి ప్రవేశించారు. డప్పు, డోలు వాయిద్యాల శబ్ధ సంబరాల మధ్య వనదేవతలను వనంలోకి ప్రవేశింపజేసే ప్రక్రియను పూజారులు నిర్వహించారు. వనదేవతల గద్దెల వద్ద ఆచార, సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత వనప్రవేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వనంలోకి వెడుతున్న ఆరాధ్య దేవతలకు భక్తులు జయజయ ధ్వానాలతో వీడ్కోలు పలికారు.

వనంలోకి వెడుతున్న దేవతలకు నమస్కరిస్తూ, మళ్లీ రెండేళ్లకు వస్తామని, చల్లగా చూడాలని భక్తులు కోరుకున్నారు. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్దరాజు పూనుగుండ్లకు, గోవిందరాజులు కొండాయికి ఆయా దేవుళ్ల పూజారులు వనప్రవేశం కోసం తీసుకువెళ్లారు. సమ్మక్క కుమారుడు జంపన్న కూడా తన వాగు వద్దకు బయలుదేరి వెళ్లారు.

ఈనెల 28వ తేదీన జాతర ప్రారంభమైన సందర్భంగా వనదేవతలు గద్దెలపై ఆసీనులై కోట్లాది మందికి దర్శనమిచ్చారు. వనదేవతలు వనంలోకి ప్రవేశించేందుకు వెళ్లినప్పటికీ, మేడారం గద్దెల వద్ద భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం మేడారంలో భక్తజన సంద్రం డ్రోన్ దృశ్యాలను దిగువన చూడవచ్చు.








