ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్ ఘటనలో పోలీసు యంత్రాంగం పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే తిరుగులేని విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్కు అడవుల్లో మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం జరిగిన భీకరపోరులో 31 మంది నక్సలైట్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల ఉదంతంలో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఆసక్తికర అంశాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో నక్సలైట్లు పెద్ద ఎత్తున సమావేశమవుతున్నారనే సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. ఈమేరకు పక్కా సమాచారాన్ని అందుకున్న ఛత్తీస్ గఢ్ పోలీసులు స్థానికులతోనేగాక లొంగిపోయిన నక్సలైట్లతో, 600 మంది శిక్షణ పొందిన కమాండోలతో కూడా టీంలను రంగంలోకి దించారు. నక్సలైట్ల ఏరివేతలో కఠోర శిక్షణ పొందిన ఈ కమాండోలు ఛత్తీస్ గఢ్ అడవుల ఆనుపానులపై గట్టి పట్టును కలిగి ఉన్నారు.

ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో మావోలు సమావేశం కానున్నారనే సమాచారంతో 15 రోజుల క్రితమే భద్రతా బలగాలు ప్రణాళికను రూపొందించాయి. ఛత్తీస్ గఢ్ పోలీసులు, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ సహా ఆయా కమాండోలు ఈనెల 6వ తేదీన ఇంద్రావతి నేషనల్ పార్కు అడవుల్లోకి ప్రవేశించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల మీదుగా ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో ప్రవేశించారు. మండేడ్, ఫర్సేఘఢ్ అడవుల్లోని గుట్టవద్ద నక్సలైట్లకు, పోలీసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఇరువర్గాల మధ్య ప్రారంభమైన భీకరపోరు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది.
ఎన్కౌంటర్ ఘటనలో నక్సలైట్లపై భారీ విజయాన్ని సాధించిన భద్రతా బలగాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. మార్చి 2026 సంవత్సరంకల్లా ఎంచుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.