Top 5 This Week

Related Posts

రైతు చావుపైనా లంచం ఆశ, వ్యవసాయాధికారి అరెస్ట్

మరిపెడ: రైతు చావుపైనా లంచం కోరిన వ్యవసాయాధికారి అవినీతి బాగోతమిది. బాధిత కుటుంబం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆశ్రయించడంతో ఆ అధికారి లంచావతారం బట్టబయలైంది. పలితంగా మానుకోట జిల్లా మరిపెడ మండలం నీలికుర్తి వ్యవసాయాధికారి గాడిపల్లి సందీప్ అరెస్టయ్యాడు.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. గత నెలలో అనేపురం గ్రామానికి చెందిన రైతు ఒకరు చనిపోయారు. ఈ రైతు కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 5.00 లక్షల మొత్తం రైతు బీమా కింది రావలసి ఉంది. ఈ డబ్బు కోసం సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) సందీప్ ను కలిసి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించారు. అయితే తనకు రూ. 20 వేలు లంచంగా ఇస్తేనే డాక్యుమెంట్లు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తానని బాధిత కుటుంబాన్ని ఏఈవో సందీప్ డిమాండ్ చేశాడు. తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని, వ్యవసాయాధారిత కుటుంబమని ఎంతగా బ్రతిమిలాడినా సందీప్ వినిపించుకోలేదు.

సందీప్ పట్టుబడిన తీరును వివరిస్తున్న ఏసీబీ అధికారి (మధ్యలో)

లంచంగా కోరిన డబ్బు ఇస్తేనే డాక్యుమెంట్లు అప్ లోడ్ చేస్తానని చెప్పాడు. అయితే లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేని బాధిత రైతు కుమారుడు హన్మకొండలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు ఏఈవో సందీప్ కోసం వల పన్నారు. ఈమేరకు మరిపెడలోని ఓ బార్ ఎదురుగా సందీప్ బాధిత కుటుంబం నుంచి రూ. 10 వేల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈవో సందీప్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ రైతు చావుపైనా లంచాన్ని ఆశించిన వ్యవసాయాధికారి బాగోతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Popular Articles