Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘కర్రెగుట్ట’ల్లో అసలు గుట్టు ఇదేనా!

కర్రెగుట్ట.. తెలుగు మీడియాలోనే కాదు.. జాతీయ మీడియాలోనూ వార్తల్లో మారుమోగుతున్న తెలంగాణా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్ధుల్లోని అటవీ ప్రాంతం. కరిగుట్టగానూ ప్రాచుర్యంలో గల కర్రెగుట్ట ఇప్పుడు మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఆఖరిపోరాట కేంద్రంగా మారనుందనే ప్రచారం కూడా సాగుతోంది. వచ్చే మార్చి నెలాఖరులోపు మావోయిస్టులను తుదముట్టిస్తామని, నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే పునరుద్ఘాటిస్తున్న నేపథ్యంలో ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ నేపథ్యంలోనే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు వెయ్యి మంది మావోయిస్టు నక్సలైట్లు కర్రెగుట్ట అడవుల్లో దాక్కున్నారని, ఇదే విషయం పోలీసులకు రూఢీ కావడంతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కేంద్ర బలగాల సాయంతో ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ను ప్రారంభించిందనేది ఆయా వార్తల సారాంశం. కర్రెగుట్ట అడవుల్లో DRG, CRPF, COBRA తదితర విభాగాలకు చెందిన స్థానిక, కేంద్ర భద్రతా బలగాలు గడచిన ఐదు రోజులుగా మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. డెబ్బయి కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ గుట్టల్లోనే మావోయిస్టులు ‘మకాం’ వేశారని అందిన సమాచారం మేరకు పోలీసు బలగాలు కర్రెగుట్ట అడవులను టార్గెట్ గా చేసుకున్నాయి. ఓవైపు వైమానికంగా, మరో వైపు ఇతరత్రా మార్గాల నుంచి నక్సల్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

కర్రెగుట్ట చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలపై ఆంక్షలు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. కర్రెగుట్టపై మకాం వేసిన మావోయిస్టులను తుదముట్టించేందుకు వారికి నిత్యావసర సరుకులు కూడా అందకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మావోయిస్టు పార్టీకి రక్షణ కవచంగా భావించిన అబూజ్ మడ్ అడవుల్లోకి చొచ్చుకుపోయి, ఆపరేషన్ కగార్ తో నక్సల్స్ కదలికలకు చెక్ పెడుతున్న భద్రతా బలగాలు కర్రెగుట్ట అడవుల్లో నానా కష్టాలు పడుతుండడం గమనార్హం.

కర్రెగుట్ట అడవుల్లో భద్రతా బలగాలు

గడచిన ఐదు రోజులుగా సాగుతున్న నక్సల్స్ గాలింపు చర్యల్లో నిన్న జరిగినట్లు పేర్కొంటున్న ఎన్కౌంటర్ లో ముగ్గురు మహిళా నక్సల్స్ మరణించారు. నక్సల్స్ వేట సాగిస్తున్న భద్రతా బలగాలు ఎండ వేడికి తట్టుకోలేక సొమ్మసిల్లుతున్నాయి. దాాదాపు ఇరవై మంది పోలీసులు వడడెబ్బకు గురికాగా, చికిత్స కోసం కొందరిని భద్రాచలానికి, మరికొందరిని బీజాపూర్ తదితర ప్రాంతాలకు తరలించారు. శనివారం నాడు చోటు చేసుకున్న ఘటనలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి డీఆర్జీ జవాన్ గాయపడ్డారు.

కర్రెగుట్టల్లో తమ రక్షణ కోసం బాంబులు అమర్చినట్లు మావోయిస్టు పార్టీ దాదాపు ఇరవై రోజుల క్రితం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన అనంతరమే భద్రతా బలగాలు కర్రెగుట్టపై తమ దృష్టిని కేంద్రీకరించడం గమనార్హం. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కర్రెగుట్టలను సుమారు 20 నుంచి 30 వేల మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ గడచిన ఐదురోజుల్లో కర్రెగుట్టలను భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ధ్రువపడిన సమాచారం రావడం లేదు.

కర్రెగుట్ట అడవుల్లోని సెలయేరు వద్ద తాగునీరు పట్టుకుంటున్న భద్రతా బలగాలు

అయితే తెలంగాణా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని గిరిజన గూడేలకు చెందిన స్థానికుల కథనం ప్రకారం.. కర్రెగుట్టలను పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడం అంత సులభతరం కాదని తెలుస్తోంది. కర్రెగుట్టల పైభాగంలో జీవనదుల్లా ప్రవహించే వాగులు, వంకలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నక్సలైట్లకు తాగునీటి సమస్య లేదనేది సుస్పష్టం. అదేవిధంగా కర్రెగుట్టపై బాంబులు అమర్చామని, వేట పేరుతో ఇటువైపు ప్రజలెవరూ రావద్దని ప్రకటన విడుదల చేసిన తర్వాత భద్రతా బలగాలు ఖచ్చితంగా తమకోసం గాలిస్తాయని అంచనా వేసిన మావోయిస్టులు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులను గుట్టపైకి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. కనిష్టంగా పదిహేనే రోజులకు సరిపడా, గరిష్టంగా నెలరోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను ముందస్తు జాగ్రత్తగా మావోయిస్టులు కర్రెగుట్టపైకి చేర్చి నిల్వ చేసినట్లు స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో గుట్టల పైనుంచి కిందకు దిగకుండానే భద్రతా బలగాలతో నక్సలైట్లు నిత్యావసర సరుకులు ఉన్నంత వరకు పోరాడే అవకాశముందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కర్రెగుట్టల్లో అనేక చోట్ల సహజసిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాల్లో నక్సల్స్ నిర్మించుకున్న బంకర్లను కనిపెట్టి భద్రతా బలగాలు వాటిని ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ కర్రెగుట్టల్లో సహజసిద్ధంగా ఉన్నటువంటి అనేక గుహల్లోనే మావోయిస్టులు తలదాచుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

అలుపెరుగని కూంబింగ్ లో కాసేపు సేద తీరుతున్న జవాన్లు

మొత్తంగా ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ అంశంలో తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి భద్రతా బలగాలు చాలా రోజుల పాటు శ్రమించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణపరంగా అబూజ్ మడ్ అడవులకన్నా అత్యంత సురక్షితంగా అంచనా వేస్తున్న ‘కర్రెగుట్ట’ అడవుల్లో భద్రాతా బలగాలు పట్టు సాధిస్థాయా? లేదా? అనే అంశంపై వేచి చూడాల్సి ఉండగా, మరోవైపు శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకుడు రూపేష్ ఒకటికి రెండుసార్లు ఇప్పటికే పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమ పిలుపునకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Popular Articles