Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

మావోయిస్టుల ఘాతుకం: ముగ్గురికి ఉరి, 12 మంది కిడ్నాప్

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మంగళవారం ఘాతుకానికి పాల్పడ్డారు. విద్యార్థి సహా ముగ్గురికి ఉరి వేసి పాశవికంగా హత్య చేశారు. బీజాపూర్ జిల్లా పెద్దకోర్మా గ్రామంలో నక్సలైట్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అంతేకాదు గ్రామానికి చెందిన ఇతరులపై కూడా దాడి చేసి దాదాపు 12 మందికిపైగా స్థానికులను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల బంధువులే టార్గెట్ గా నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, లొంగిపోయిన నక్సలైట్లతో సంబంధాలు నెరపుతున్నవారిని శిక్షించడమే నక్సలైట్ల దాడి లక్ష్యంగా స్థానిక పోలీసులు భావిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. పెద్దకోర్మా గ్రామానికి చెందిన జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మడివి అనే వ్యక్తులను మంగళవారం సాయంత్రం నక్సలైట్లు తాళ్ళతో ఉరి వేసి చంపారు. నక్సల్స్ చర్యకు బలైనవారిలో ఒక విద్యార్థి కూడా ఉన్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు బాధితులు కొద్ది నెలల క్రితం ఆయుధాలతో ప్రభుత్వానికి లొంగిపోయిన దినేష్ మోడియం అనే నక్సలైట్ బంధువులుగా చెబుతున్నారు. బీజాపూర్ జిల్లాలో దినేష్ మోడియం కరడుగట్టిన మావోయిస్టు నాయకుడు. ఇతని లొంగుబాటు వ్యూహాత్మకంగా పోలీసులు లాభించినట్లు తెలుస్తోంది. ఈ ఘాతుక చర్యలకు మావోయిస్ట్ కమాండర్ వెల్ల దళం నాయకత్వం వహించినట్లు సమాచారం.

కాగా ముగ్గురు వ్యక్తులను ఉరి వేసి చంపిన నక్సలైట్లు ఏడుగురు గ్రామస్తులపై కూడా దాడి చేసి గాయపరిచారు. మరో డజనుకుపైగా స్థానికులను తమ వెంట తీసుకువెళ్లారు. వీరి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఈ రాత్రి 8.30 గంటల వరకు కూడా నక్సల్స్ చేతిలో హత్యకు గురైనవారి కుటుంబ సభ్యులు పోలీసులు సంప్రదించలేదు. పెద్దకోర్మా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నక్సల్స్ తమ వెంట తీసుకువెళ్లిన డజన్ మంది గురించి గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మారుమూల ప్రాంతమైన పెద్దకోర్మాకు పోలీసులు ఈ రాత్రికి వెళ్లే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నక్సలైట్లు ఆకస్మిక దాడి, లేదా మందుపాతర పేల్చే అవకాశమున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

Popular Articles