ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు సోమవారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో డీఎస్పీ, సీఐ సహా మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా జిల్లా కుంట-ఎర్రబోర్ రోడ్డులోని దొండ్రా గ్రామం సమీపంలో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
నిర్మాణపు పనుల్లో గల వాహనాలను నక్సలైట్లు తగులబెట్టినట్లు సమాచారం అందుకున్న సీఐ, డీఎస్పీ తదితర అధికారులతో, సిబ్బందితో కలిసి అదనపు ఎస్పీ గిరిపుంజె ఆకాశ్ రావు ఘటనా స్థలానికి వెడుతుండగా, మాటువేసిన మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో వాహనంలోని అదనపు ఎస్పీ సహా ఇతర అధికారులు, పోలీసులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అదనపు ఎస్పీ ఆకాశ్ రావును తొలుత కుంటలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ధ్రువీకరించిన వైద్యులు ఎంతగా ప్రయత్నించి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే అదనపు ఎస్పీ ఆకాశ్ రావు ప్రాణాలు కోల్పోయారు.

ఆకాశ్ రావు 2016 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఆయన యువ, ధైర్యవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. నక్సల్స్ ప్రభావిత సున్నిత, మావోయిస్టు ప్రాబల్యం గల ప్రాంతంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఎదురుదెబ్బలతో నాయకత్వపరంగా భారీగా నష్టపోయిన నక్సలైట్లు ఈ ఘటనకు పాల్పడడం గమనార్హం. కాగా మందుపాతరలో గాయపడిన ఇతర అధికారులను, పోలీసులను మెరుగైన చికిత్స కోసం జగదల్ పూర్ ఆసుపత్రికి తరలించారు.