ఛత్తీస్ గఢ్: హిడ్మా ఎన్కౌంటర్ ఘటనపై మావోయిస్ట్ పార్టీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ పేరుతో విడుదలైన ఈ ప్రకటన గత నెల 27వ తేదీతో ఉండడం గమనార్హం.
తమ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెసల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మాను, అతనితోపాటు ఉన్న ఐదుగురిని ఏపీ పోలీసులు నవంబర్ 15వ తేదీన అరెస్ట్ చేసి, మూడు రోజులపాటు చిత్రహింసలకు గురిచేసి 18వ తేదీన ఎన్కౌంటర్ కథను అల్లారని వికల్ప్ ఆరోపించారు. విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం హిడ్మా అక్టోబర్ 27వ తేదీన విజయవాడకు వెళ్లాడని చెప్పారు. ఆ తర్వాత మరికొద్ది మంది వెళ్లగా, నిరాయుధులుగా ఉన్న హిడ్మా సహా ఆరుగురిని పోలీసులు పట్టుకుని మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు కట్టుకథను ప్రచారం చేశారన్నారు.
అదేవిధంగా నవంబర్ 19వ తేదీన రంపచోడవరంలో జరిగినట్లు పేర్కొంటున్న ఎన్కౌంటర్ లో మరో ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారని, టెక్ శంకర్ సహా వీరిని కూడా నిరాయుధులుగానే పట్టుకుని బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపినట్లు ఆయన ఆరోపించారు. ఈ రెండు ఘటనల్లో కూడా వారిని బయటకు తీసుకువెళ్లిన వ్యక్తులే పోలీసు ఇన్ఫ్మార్లుగా అర్థమవుతోందన్నారు.
నవంబర్ 9వ తేదీన తమ బలగాల నుంచి కంపెనీ పార్టీ సభ్యుడు కోసాల్ పారిపోయి తెలంగాణా పోలీసులకు సరెండర్ అయ్యాడని, హిడ్మా ప్రయాణ వివరాలు, హిడ్మా బయట ఉంటున్నాడనే విషయం అతనికి తెలుసని వికల్ప్ పేర్కొన్నారు. అయితే కోసాల్ పారిపోయిన విషయాన్ని తెలుపుతూ వెంటనే లోపలికి రావలసందిగా తమ కామ్రేడ్స్ కు సమాచారం అందించామన్నారు. దీంతో తన టీముతో లోపలికి రావడానికి హిడ్మా, టెక్ శంకర్ టీంలు సిద్ధమై ఉంటారన్నారు. అయితే విషయాన్ని హిడ్మాను తీసుకువెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో హిడ్మా, శంకర్ టీంలను పోలీసులు ఒకేసారి అరెస్ట్ చేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు.
ఈ రెండు ఘటనలతోపాటు విజయవాడ, ఎన్టీఆర్,కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను కూడా వాళ్లను తీసుకువెళ్లిన విజయవాడ కలప వ్యాపారి, బిల్డర్ కమ్ సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి జిల్లాలో ఐటీడీఏ పనులు చేేసే మరో కాంట్రాక్టర్ సహా ఈ ముగ్గురు కారకులని వికల్ప్ ఆరోపించారు. వీరితోపాటు తమ నుంచి పారిపోయిన కోసాల్ ఇచ్చిన సమాచారం కూడా కారణమేనని అన్నారు.
దేవ్ జీకి సంబంధం లేదు:
పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్టుల్లో పార్టీ అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు లేరని వికల్ప్ ప్రకటించారు. ఈ ఇద్దరు అగ్రనేతలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పోలీసులతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు. ఈ మొత్తం అంశంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం, సోనిసోడీలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వికల్ప్ పేర్కొన్నారు. దేవ్ జీ పై మనీష్ కుంజాం, సోనిసోడీలు చేసిన ప్రకటన కుట్ర పూరితమన్నారు. హిడ్మా, టెక్ శంకర్ ఎన్కౌంటర్ ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ తన ప్రకటనలో డిమాండ్ చేశారు.

