మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ @ అభయ్ @ సోను మరో సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం పార్టీలో బాధ్యత వహించిన పదవిలో ఇక తాను ఉండలేనని వెల్లడించారు. సోను పేరుతో మొత్తం 22 పేజీలతో కూడిన ఈ లేఖలో అనేక అంశాల ప్రస్తావన ఉంది. ఇదే దశలో పార్టీ అప్పగించిన బాధ్యతల్లో కొనసాగే అంశంలో ఆయన స్పష్టతనిచ్చారు. ‘ఆయుధాలు వదిలేస్తాం’ అంటూ కొద్దిరోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అభయ్ తన వద్ద గల ఆయుధాలను అప్పగించాలని, లేనిపక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందుని పార్టీ ప్రకటన జారీ చేసింది. మొత్తం తాజా పరిణామాల్లో అభయ్ అలియాస్ సోను పేరుతో మరో 22 పేజీల లేఖ సోషల్ మీడియాలో తిరుగుతోంది.
విజ్ఞప్తి పేరుతో విడుదలైన ఈ లేఖలో ప్రియమైన కామ్రేడ్స్ లాల్ సలాం అంటూ.. తాజాగా అభయ్ ఏమంటారంటే..?
‘ముందుగా నేను ఒక కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఇంతకాలం మన పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమాన్ని ఓటమిపాలు కాకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత పడుతూ మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఇంతటి నష్టాలకు, బలిదానాలకు దారి తీసిన విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన నేను ఇకపై ఈ బాధ్యతల్లో కొనసాగడానికి ఇంకా ఎంతమాత్రం అర్హున్ని కాననీ భావిస్తున్నాను. పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నపుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని మీరు భావించవచ్చు. కానీ, పార్టీని కాపడుకోవడానికి, సరైన పార్టీ నాయకత్వాన్ని కేడర్లు ఎంచుకోవడానికి ఇలాంటి పరిస్థితులే అనివార్యం చేస్తాయి. నా అభిప్రాయాన్ని మీ అంతిమ నిర్ణయానికి వదలడం మించి నాకు మరే మార్గం లేదు. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అంటూ అభయ్ తన 22 పేజీల లేఖలో ప్రస్తావించిన ముఖ్యాంశమిది.
అయితే ఇదే లేఖలో చివరి పేరాలో అభయ్ అలియాస్ సోను మరిన్ని కీలక విషయాలను ప్రస్తావించడం గమనార్హం. లేఖలో చివరి పేరాలో ముగింపునిస్తూ, ‘ఇపుడు మనకు సానుకూల మార్పు కావాలి. ఉద్యమాన్ని కాపాడుకోవడం, కేడర్లను రక్షించుకోవడం కావాలి. అనవసర త్యాగాలకు అంతం పలుకుదాం. నూతన పద్ధతుల్లో పురోగమిద్దాం. అంతిమ విజయం ప్రజలదే.’’ అని ఆయన అన్నారు. దీంతో అభయ్ అడుగులు ఎటువైపు? ప్రభుత్వానికి లొంగిపోవడానికి ఆయన సంసిద్ధమయ్యాడా? లేక సాధారణ సభ్యునిగానే పార్టీలో కొనసాగుతాడా? సరైన నాయకత్వాన్ని కేడర్ ఎంచుకోవడానికి ఇలాంటి పరిస్థితులే అనివార్యం చేస్తాయి.. అంటూ పేర్కొనడంలో మర్మమేంటి? వంటి అనేక ప్రశ్నలు విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో రేకెత్తుతున్నాయి.