(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా ఎన్కౌంటర్ ఘటనలో ‘ఇన్ఫార్మర్ల’ అంశం తెరపైకి వచ్చింది. గత నెల 18వ తేదీన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో హిడ్మా సహా ఐదుగురు నక్సలైట్లు మరణించారని పోలీసు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన ప్రత్యేక సమాచారంతో హిడ్మాను తాము మట్టుబెట్టగలిగామని ఏపీ ఇంటెలిజెన్స్ వింగ్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్హా వెల్లడించారు.
హిడ్మా ఎన్కౌంటర్ ఘటన దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలకు తావు కల్పించిన పరిణామాల్లో మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటి మీడియా ప్రతినిధి వికల్ప్ గత నెల 27వ తేదీతో విడుదల చేసిన తాజా ప్రకటన సంచలనాత్మకంగా మారిందనే చెప్పాలి. వికల్ప్ విడుదల చేసిన ప్రకటనలో హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని ఆరోపించారు. అంతేకాదు టెక్ శంకర్ ఎన్కౌంటర్ ఘటనను కూడా పోలీసుల కట్టుకథగా పేర్కొన్నారు. ఇదే సందర్భంలో తమ పార్టీకి చెందిన సభ్యుడిపైనా, ఓ కలప వ్యాపారిపైనా, ఇద్దరు కాంట్రాక్టర్లపైనా తీవ్ర ఆరోపణలు చేశారు.
వికల్ప్ తన ప్రకటనలో చెప్పిందేమిటంటే..? అల్లూరి జిల్లాలోరి మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో హిడ్మా, టెక్ శంకర్ లు సహా 12 మంది మావోయిస్టుల మరణం వెనుకనేగాక, విజయవాడ, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ జిల్లాల్లో 50 మంది సహచరుల అరెస్ట్ వెనుక కొందరు ఇన్ఫార్మర్లు ఉన్నారనేది వికల్ప్ ఆరోపణ. విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి, బిల్డర్ కమ్ సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి జిల్లాలో ఐటీడీఏ కాంట్రాక్టు పనులు నిర్వహించే మరో కాంట్రాక్టరే ఇందుకు కారకులుగా వికల్ప్ ఆరోపించారు. విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా చికిత్స కోసం వెళ్లాడని కూడా చెప్పారు. అంతేకాదు తమ కంపెనీ నుంచి పారిపోయిన కోసాల్ అనే సభ్యుడు కూడా తమ వారి ఆచూకీ గురించి పోలీసులకు ఇచ్చాడని వికల్ప్ వెల్లడించారు.

హిడ్మా, టెక్ శంకర్ లు మరణించిన ఎన్కౌంటర్లు బూటకమా? వాస్తవమా? అనేది ఇక్కడ చర్చ కాదు. ఈ అంశంలో అటు పోలీసులు, ఇటు మావోయిస్టు పార్టీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. కానీ ఈ ఇద్దరు నక్సల్ ముఖ్యనేతలు మరణించిన ఎన్కౌంటర్లకు కారకులుగా మావోయిస్ట్ పార్టీ మీడియా ప్రతినిధి వికల్ప్ ఆరోపించిన విజయవాడకు చెందిన కలప వ్యాపారి ఎవరు? మిగతా ఇద్దరు కాంట్రాక్టర్లు ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వికల్ప్ ఆరోపణలు నిజమే అయితే.. అసలు మావోయిస్టులు వ్యాపారులను, కాంట్రాక్టర్లను ఎందుకు విశ్వసించారు? వారిని నమ్మి ఎందుకు విజయవాడ వరకు వెళ్లారు? అనే ప్రశ్నలపైనా భిన్న చర్చ జరుగుతోంది. ఆ చర్చల సారాంశంలోకి వెడితే..
నక్సలైట్లకు, వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు గల ఆర్థిక సంబంధాలు బహిరంగమే. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది కూడా. ప్రస్తుతం చట్టసభల్లో గల కొందరు ప్రజాప్రతినిధులైన ఒకప్పటి బడా కాంట్రాక్టర్లు కూడా నక్సలైట్లకు నిధులు సమకూరుస్తూ, ఆయుధాలను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కిన ఉదంతాలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి. మూడు దశాబ్ధాల క్రితమే ఇంటెలిజెన్స్ బ్యూరో అంచనా వేసిన ప్రకారం నక్సలైట్లకు వ్యాపారుల, కాంట్రాక్టర్ల నుంచి అందుతున్న ఆర్థిక సహకారపు మొత్తం రూ. 500 కోట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటి జీవన ప్రమాణాల ప్రకారం ఆయా మొత్తం ఎంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఇదంతా లోతైన మరో అంశం.
ప్రముఖ వ్యాపారులు, తునికాకు కాంట్రాక్టర్లు, సివిల్ కాంట్రాక్టర్లు నక్సల్స్ కు నిధులు ఎందుకు సమకూరుస్తారనేది పోలీసులకు తెలియని విషయమూ కాదు. కానీ కలప వ్యాపారులతో నక్సల్స్ బంధమే హిడ్మా ఎన్కౌంటర్ ఘటనలో కొత్తగా తెరపైకి రావడం గమనార్హం. ఇంతకీ మావోయిస్టులతో కలప వ్యాపారులకేం పని? అనే ప్రశ్నకు వస్తే.. ప్రస్తుత ఏపీలోని చింతూరు, వీఆర్ పురం (పూర్వ ఉమ్మడి ఖమ్మం జిల్లా) మండల కేంద్రాల్లో అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ కలప డిపోలు ఉన్నాయి. చింతూరుకు సుమారు 50 కి.మీ. దూరంలో గల ఛత్తీస్ గఢ్ లోని సుక్మాలోనూ ప్రభుత్వ కలప డిపో ఉంది. ఆ పక్కనే జగదల్ పూర్, దంతెవాడ, ఇటు బీజాపూర్ వంటి అనేక ప్రాంతాల్లో కూడా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ కలప డిపోలు ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఛత్తీస్ గఢ్ లో లభించే టేకు కలప అత్యంత నాణ్యమైనదిగా టింబర్ వ్యాపారులు చెబుతుంటారు. బర్మా (మయన్మార్) టేకుకు తీసిపోని విధంగా ఛత్తీస్ గఢ్ టేకు కలప ప్రాచుర్యం పొందింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కలపతోపాటు, అడవుల్లో వివిధ కారణాల వల్ల నేలవాలిన టేకు దుంగలను అటవీ శాఖ సేకరించి సమీప ప్రభుత్వ టింబర్ డిపోలకు తరలిస్తుంది. అటవీ శాఖలోని లాగింగ్ విభాగం ఈ వ్యవహారాన్ని చూస్తుంది. చింతూరు, వీఆర్ పురం, సుక్మా, దంతెవాడ, జగదల్ పూర్ ప్రాంతాల్లోని ప్రభుత్వ కలప డిపోల్లో నిర్ణీత తేదీల్లో ‘లాట్’ల వారీగా అటవీ అధికారులు టేకు దుంగల వేలం నిర్వహిస్తారు. ఇటువంటి వేలంలో పాల్గొని కలపను కొనుగోలు చేయడం ద్వారా టింబర్ డిపోల యజమానులు వ్యాపారం నిర్వహిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణా, అటు ఆంధప్రదేశ్, ఇంకోవైపు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని పలువురు కలప వ్యాపారులు ప్రభుత్వ టింబర్ డిపోల్లో నిర్వహించే వేలం పాటల్లో పాల్గొంటారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారులు కూడా అనేక మంది ఇటువంటి వేలంలో పాల్గొనడం సాధారణమే. గత కొన్ని దశాబ్ధాలుగా విజయవాడ వ్యాపారులు చింతూరు, వీఆర్ పురం, సుక్మా తదితర ప్రాంతాల్లోని టింబర్ డిపోల ద్వారా కలపను వేలంలో దక్కించుకుని తమ వ్యాపారం కోసం తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు కలప వ్యాపారులతో ఏవేని ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకుని ఉంటారా? తద్వారా వికల్ప్ ఆరోపణ చేసిన వ్యాపారిని హిడ్మా విశ్వసించి ఉంటాడా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
అదేవిధంగా రంపచోడవరంలో ప్రధాన ఐటీడీఏ ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత దానికి అనుబంధంగా సబ్ ఐటీడీఏను చింతూరులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి ఐటీడీఏ పలు అభివృద్ధి పనులను నిర్వహిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఇద్దరు కాంట్రాక్టర్లపైనా మావోయిస్టు నేత వికల్ప్ ఆరోపణలు చేయడం, అందులో ఐటీడీఏ కాంట్రాక్టర్ ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. దీంతో నక్సల్స్ తో సంబంధాలు నెరపుతున్న ఐటీడీఏ కాంట్రాక్టర్ ఎవరు? వికల్ప్ ఉటంకించిన మరో బిల్డర్ కమ్ సివిల్ కాంట్రాక్టర్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా హిడ్మా ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు ఆయుధంతో లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ మాజీ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ స్పందించారు. ఓ అంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లోజుల మాట్లాడుతూ, ‘నేను అందరిలాగే మీడియా వార్తల ద్వారా హిడ్మా మరణం గురించి తెలుసుకున్నాను. ఆగస్టులో జరిగిన ప్రత్యేక సమావేశంలో హిడ్మా, మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, నలుగురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు తీసుకున్న తీర్మానాలను నేను వెంటనే గుర్తుచేసుకున్నాను. మేం దండకారణ్యంలో ఉండలేమని వారు గ్రహించారు. మూడు గ్రూపులుగా విడిపోవాలని భావించారు. ఒకరు అవకాశాలు ఉన్న ప్రదేశానికి వెళ్లి కనీసం రెండు సంవత్సరాలు జీవించాలని నిర్ణయించుకున్నారు. రెండవ గ్రూపు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలని భావించింది. మూడో గ్రూపు ఒక చిన్న సమూహం, దండకారణ్యంలో ఉండాలని నిర్ణయించుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా హిడ్మా దండకారణ్యం వెలుపల వెళ్లారని,అది తప్పుడు నిర్ణయంగా నేను భావించాను’ అని పేర్కొనడం గమనార్హం.

