Top 5 This Week

Related Posts

కర్రెగుట్టల్లో ‘కోవర్ట్’ అతడే! మావోయిస్ట్ పార్టీ సంచలన ప్రకటన

కర్రెగుట్టలు గుర్తున్నాయా? మావోయిస్ట్ పార్టీ నాయకులకు, కేడర్ కు దుర్భేద్య కోటగా ప్రాచుర్యం పొందిన కర్రెగుట్టలపైకి ఛత్తీస్ గఢ్ భద్రతా బలగాలు చేరుకుని నక్సలైట్లపై లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే. తెలంగాణా-ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో గల కర్రెగుట్టలను స్థానిక పరిభాషలో ‘కరిగుట్టలు’గానూ వ్యవహరిస్తారు. కర్రెగుట్టల చుట్టూ మందుపాతరలు అమర్చామని, ఇటువైపు ఎవరూ రావద్దని మావోయిస్టు పార్టీ ప్రకటించిన పరిణామాల్లో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని సవాల్ గా స్వీకరించాయి. ఇందులో భాగంగానే ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ కార్యక్రమాన్ని నిర్వహించి అత్యంత సాహసోపేతంగా గుట్టలపైకి చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య అనేకసార్లు ఎదురుకాల్పులు కూడా జరిగిన సంగతి తెలిసిందే. కర్రెగుట్టలపైకి భద్రతా బలగాలు చేరుకోవడాన్ని కేంద్ర పాలకులు సైతం ప్రశంసించారు. మొత్తంగా కర్రెగుట్టలు ఇప్పుడు కేంద్ర బలగాల వశమయ్యాయి.

అయితే నక్సలైట్ల రక్షణ కోటగా భావిస్తున్న కర్రెగుట్టల్లోకి భద్రతా బలగాలు చేరుకోవడం వెనుక గల కారణాన్ని మావోయిస్టు పార్టీ తాజాగా బహిర్గతం చేయడం గమనార్హం. ఆ పార్టీ కేంద్ర కమిటీ పేరుతో నిన్న విడుదలైన పది పేజీల కీలక లేఖలో కర్రెగుట్టల్లోకి భద్రతా బలగాలు చేరుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ అంశంపై మావోయిస్టు పార్టీ తన లేఖలో ఏమంటున్నదంటే..?

కర్రెగుట్ట ఆపరేషన్ సమయంలో తాము వేలాది బూబీ ట్రాపుల్ని అమర్చినట్లు మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. దీంతో 16 రోజులపాటు పోలీసు సాయుధ బలగాలు అడ్వాన్స్ కాలేకపోయాయని తెలిపింది. చివరికి తమ పార్టీకి చెందిన ‘మూకాల్’ అనే వ్యక్తి పారిపోయి పోలీసులకు లొంగిపోయి ద్రోహిగా మారాడని, వారికి గైడ్ గా వ్యవహరించాడని, ఫలితంగా పోలీసు బలగాలతో దాడి చేయించడంతో పార్టీకి నష్టాలు కలిగాయని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. అయితే ఇదే సమయంలో 110 చోట్ల బూబీ ట్రాప్స్ పేలి 45-50 మంది శత్రు సాయుధ బలగాలు చనిపోయాయయని, 70-80 మందిగాయపడ్డారని పార్టీ పేర్కొంది.

కర్రెగుట్టలపైకి ఎక్కుతున్న భద్రతా బలగాలు (ఫైల్ ఫొటో)

అదేవిధంగా మే 8వ తేదీన భద్రతా బలగాలు తమను చుట్టుముట్టి దాడి చేసినప్పటికీ, అత్యంత ధైర్య, సాహసాలతో తిప్పికొట్టినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ ప్రతిఘటనలో తమ బలగాలు ఐదుగురు గ్రేహౌండ్స్ కమాండోలను నిర్మూలించి, నలుగురు కమాండోలను గాయపర్చినట్లు, వారి వద్ద నుంచి ఒక ఏకే-47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలతోపాటు 150 తూటాలను, ఇతరత్రా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి క్రాస్ ఫైరింగ్ లో గ్రేహౌండ్స్ బలగాలు చనిపోయినట్లు ప్రకటించారని, ఇదే తరహాలో ఇంకా అనేక ఉదంతాలు జరిగాయని ముర్దొండ ఘటనను పార్టీ ఉటకించింది. ఝార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని పేర్కొంది. తన పక్షానికి జరుగుతున్న నష్టాన్ని ప్రకటించకుండా, కొన్ని సందర్భాల్లో ప్రకటించడం, ఎదుటి పక్షానికి జరుగుతున్న నష్టాలను ఎక్కువ చేసి ప్రకటించడం మానసిక యుద్ధంలో భాగమని మావోయిస్టు పార్టీ తన పది పేజీల లేఖలో అభివర్ణించింది.

Popular Articles