మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను అలియాస్ అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఆ పార్టీ తోసిపుచ్చింది. ఆయుధాలు వదిలేస్తామని, తాత్కలిక సాయుధ పోరాట విరమణ పేరుతో సోను చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప, పార్టీ నిర్ణయం కాదని పేర్కొంది. ఈమేరకు మావోయిస్ట్ పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ పత్రికా ప్రకటన శుక్రవారం సోషల్ మీడియా వేదికగా విడుదలైంది.
విప్లవోద్యమంపై ఎడాపెడా నిర్బంధం, దాడులు, సడలింపులు లేని యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో నెలరోజుల సమయం కావాలంటూ సోను చేసిన ప్రకటన అనాలోచిత చర్యగా జగన్ వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన సోనూ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని, ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలని, వారి అభిప్రాయాలు తెలపాలని, ఈమెయిల్ అడ్రస్ కు పంపాలని కోరుతూ చేసిన ప్రకటన ఏ పద్ధతిగా పేర్కొనాలో అర్థం కావడం లేదని జగన్ అన్నారు.

సోను తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్ లో పంపించి ఉంటే అతని ప్రశ్నలకు జవాబులు దొరికేవని, అది చేయకపోవగా ఈ విధంగా కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుతుందని ఆయన అన్నారు. సోను అనుసరించిన పద్ధతి ఉద్యమానికి ఉపకరించకపోగా, నష్టం చేస్తుందన్నారు. పార్టీ ఎదుర్కుంటున్న ప్రస్తుత స్థితిపై అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారని, ఈ సమస్యకు ఇప్పుడే పరిష్కారం దొరకకపోవచ్చన్నారు. పొలిట్ బ్యూరో 2024లో విడుదల చేసిన సర్క్యులర్ ను అమలు పర్చడమే తక్షణ కర్తవ్యమన్నారు. సోను చేసిన ప్రకటన పార్టీపరంగా అధికారికం కాదని, విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదని, గందరగోళపడాల్సిన అవసరం లేదని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

