Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మావోల ‘శాంతి’ చర్చల వైఖరి: ‘బస్తర్ యుద్ధం’లో తుపాకుల గర్జన ఆగేనా!?

బస్తర్ అడవుల్లో తుపాకుల గర్జనకు విరమణ లభిస్తుందా? మావోయిస్టుల శాంతి చర్చల పిలుపునకు కేంద్ర, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందిస్తాయా? ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సాగుతున్న ‘యుద్ధం’లో రక్తమోడుతున్న దృశ్యాల ముగింపును ఆశించవచ్చా? ఇవీ తాజా ప్రశ్నలు. బలమైన రాజ్యంతో యుద్ధం చేస్తున్న మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. సామ్రజ్యవాదం, దళారీ, పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థలు, సమసమాజ స్థాపనల సంగతి ఎలా ఉన్నప్పటికీ సాయుధ పోరాటం చేస్తున్న ‘అన్నలు’ కాసేపు కాల్పుల విరమణకు సంసిద్ధమయ్యారు. ఓ రకంగా ఇది ఆహ్వానించదగిన పరిణామామే.

నిజానికి ఏ యుద్ధమైనా అంతిమంగా శాంతి చర్చలవైపు మళ్లాల్సిందే. ప్రపంచంలోని అనేక యుద్ధాలు, పోరాటాలు చెప్పిన ‘పాఠం’ కూడా ఇదే. అయితే దేశాల మధ్య జరిగే యుద్ధాలు వేరు. స్వదేశంలోనే, సొంత పౌరులతో జరిగే ‘తుపాకీ యుద్ధం’ వేరు. ఈ రెండింటి మధ్య సారూప్యతలో చాలా వ్యత్యాసముంటుంంది. మనదేశంలోనే, మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ లోనే కాదు, దానిని అనుకుని ఉన్న మధ్యప్రదేశ్, ఒడిషా, ఆ పక్కనే గల మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో తుపాకుల గర్జన ఈనాటిది కాదు. దశాబ్ధాలుగా కొనసాగుతున్నదే.

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా నక్సల్ రహిత దేశంగా మారుస్తామని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చెబుతూనే ఉన్నారు. విప్లవోద్యమ నిర్మూలన సాధ్యమా? కాదా? అనే చర్చ సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటికైతే ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులపై పాలక పార్టీలదే పైచేయిగా చెప్పక తప్పదు. నక్సల్స్ రహిత దేశం ఆవిర్భావ దిశగా అడుగులు పడుతున్నాయని భారీ ఎన్కౌంటర్లు జరిగిన వేర్వేరు ఘటనల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటిస్తూనే ఉన్నారు. దేశంలో తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుంచి ఆరుకు తగ్గించగలిగినట్లు నిన్ననే ఆయన ప్రకటించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఈ పరిస్థితుల్లోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ కీలక పత్రికా ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన ద్వారా మావోయిస్టు పార్టీ శాంతి చర్చలను కోరుకుంటోంది. కగార్ పేరుతో ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న ‘యుద్ధ’ ఫలితాలను ప్రస్తావిస్తూనే తక్షణ కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే కండిషన్స్ అప్లయ్.. తరహాలో ఈ ప్రకటన ఉండడమే గమనించదగిన విషయం. విప్లవోద్యమ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని అభయ్ ‘జీనోసైడ్’గా అభివర్ణించారు. జీనోసైడ్ అంటే ‘నరసంహారం’ అని కూడా ఆయన నిర్వచించారు.

గడచిన పదిహేను నెలల కాలంలో దేశవ్యాప్తంా ఇప్పటి వరకు తాము 400కుపైగా నాయకులను, కార్యకర్తలను, గెరిల్లా సైన్యాన్ని కోల్పోయినట్లు వెల్లడించారు. ఇంకా అనేక అంశాలను అభయ్ పేర్కొంటూ ప్రజల ప్రయోజనాల కోసం తాము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంందు ప్రతిపాదనను ఉంచారు. తాము చేస్తున్న ప్రతిపాదనల ఆధారంగా చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కూడా వివిధ వర్గాలను మావోయిస్టు పార్టీ కోరింది.

నిజానికి ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటే, శాంతి చర్చలకు, తక్షణ కాల్పుల విరమణకు మావోయిస్టు పార్టీ ఓ అడుగు ముందుకేయడం ఆహ్వానిత పరిణామంగానే భావించవచ్చు. ఇదే దశంలో శాంతి చర్చల కోసం కండిషన్స్ అప్లయ్.. టైపులో మావోయిస్టు పార్టీ చేసిన ప్రతిపాదనలపైనా చర్చ జరుగుతోంది. కగార్ పేరుతో ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న ఆపరేషన్ ను నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని మావోయిస్టు పార్టీ ప్రధానంగా ప్రతిపాదించింది. వీటికి పాలక పార్టీలు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే తాము కాల్పుల విరమణ ప్రకటిస్తామని ఆ పార్టీ స్పష్టతనిచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం

ఈ నేపథ్యంలో ప్రస్తుతం షరతులను విధించే స్థితిలో మావోయిస్టు పార్టీ ఉందా? అనే ప్రశ్న విప్లవ కార్యకలాపాల పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. విప్లవ కార్యకాపాలపై పట్టుగల కొందరి వాదన ప్రకారం ఛత్తీస్ గఢ్ లో మిలీషియా సభ్యులకు సైతం మావోయిస్టు పార్టీ తుపాకులను ఇచ్చి రాజ్యంపై పోరాటానికి దింపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిలిటెంట్లకు ‘తపంచా’ వంటి దేశవాళీ ఆయుధాలను మాత్రమే అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ అప్పగించేది. కానీ ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రంలో నిండా 14 ఏళ్లు నిండని బాలలకు సైతం ఏకే-47 వంటి అధునాతన ఆయుధాలను సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి.

ఇటు తెలంగాణాను, అటు ఏపీని ఆనుకుని ఉన్న ఛత్తీస్ గఢ్ లోని సుక్మా, దంతెవాడ, బీజాపూర్, కాంకేర్, ఆ పక్కనే గల నారాయణపూర్ వంటి అనేక జిల్లాలో మావోయిస్టు పార్టీ పోటీ ప్రభుత్వాన్ని నడిపిన రోజులు ఇప్పుడు లేవనే చెప్పాలి. అనధికార సమాచారం ప్రకారం ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ బేస్ క్యాంపు చొప్పున ఏర్పాటయ్యాయి. శత్రు దుర్బేధ్య ప్రాంతంగా భావించే అబూజ్ మడ్ వంటి ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు చొచ్చుకుపోయి మావోల ఆనుపానులపై గట్టి పట్టు సాధించాయి. అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరికరాలతో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో నక్సలైట్లు నేలకొరుగుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో, పరిణామాల్లో ఒకప్పుడు బస్తర్ అడవుల్లో ‘జనతన’ సర్కార్ ను నిర్వహించిన మావోలు శాంతి చర్చలకు ముందుకు వస్తూనే, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరిస్తూనే షరతులు విధించడంపైనే విప్లవోద్యమ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తరపున అభయ్ విడుదల చేసిన ప్రకటనను లోతుగా పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతోందని చెబుతున్నారు. నిజానికి మావోలు ‘యుద్ధం’తో రాజీపడడం లేదు. తాత్కాలిక యుద్ద విరామానికి మాత్రమే సంసిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అంతేకాదు సాయుధ పోరాటాన్ని వదిలేస్తామని కూాడా చెప్పడం లేదు. ఏ విప్లవోద్యమ పార్టీ కూడా సాయుధ పోరాటాన్ని త్యజిస్తామని, ఆయుధాలను వదిలేస్తామని చెప్పిన దాఖలాలు లేవనేది వేరే విషయం.

బస్తర్ అడవుల్లో భద్రతా బలగాలు (ఫైల్ ఫొటో)

రాజ్యం బలీయంగా ఉన్నపుడు, శక్తివంతమైన రాజ్యంతో తలపడే పరిస్థితులు తల్లకిందులైనప్పుడు మావోల శాంతి చర్చల పిలుపులోని ‘యుద్ధ’ విరామం రాజకీయ నిర్ణయమే కావచ్చు. కానీ శాంతి చర్చల పేరుతో గతంలో జరిగిన ఘటనలను, ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, వాటి ఫలితాలను ఓ గుణపాఠంగా స్వీకరించడం కూడా విప్లవోద్యమంలో ఓ భాగమనే నిర్వచించక తప్పదు. ఇదే దశలో మావోయిస్టు పార్టీకి చెందిన ‘యుద్ధ’ నాయకత్వం ఇంకా ఛత్తీస్ గఢ్ లోనే ఉందా? ఉంటే సురక్షిత ‘షెల్టర్’ జోన్ లోనే ఉందా? అనే ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా ఉద్భవిస్తున్నాయి.

మొత్తంగా చూసినపుడు, కారణాలు ఏవైనప్పటికీ, తాత్కాలికంగానే కావచ్చు.. తుపాకీ కాల్పుల విరమణకు మావోలు ఓ అడుగు ముందుకేశారు. వారి ప్రతిపాదనలు సహేతుకమా? కాాదా? అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయా? లేదా? అనేది వేరే ప్రశ్నలు. అయితే ఇదే దశలో ఆయుధాలను వదిలి అడవుల నుంచి బయటకు రావాలని, జనజీవన స్రవంతిలో కలవాలని కూడా ప్రభుత్వాలు షరతు విధించే అవకాశాలనూ పరిశీలకులు తోసిపుచ్చడం లేదు. అయితే అంతిమంగా ఛత్తీస్ గఢ్ లో తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి పాలక పార్టీలు సైతం శాంతి చర్చలకు ఓ అడుగు ముందుకే వేయాలని శాంతికాముకులు అభిలషిస్తున్నారు. ఎడతెరిపిలేని యుద్ధంలో ఒక్కోసారి స్థానికులలో వ్యతిరేకతను పెంచే అవకాశాలను కూడా తోసిపుచ్చలేకపోతున్నారు.

ఇదే జరిగితే.. బస్తర్ అడవుల నుంచే కాదు మొత్తం దేశంలోనే నక్సల్స్ లేకుండా ఏరిపారేసినప్పటికీ, స్థానిక ప్రజల సహకారం లేకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వాలకు సైతం పరిస్థితులు అనుకూలించకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ‘యుద్ధం’లో విరామం ఇరువర్గాలకూ అవసరమే. ఈ యుద్ధ విరమణ అంతిమంగా ప్రజా సంక్షేమానికి, శాంతికి దారి తీస్తే అంతకంటే ఆశించిన ‘విప్లవం’ ఇక్కడ మరొకటి ఉండకపోవచ్చు. మావోల శాంతి చర్చల అడుగైనా, పాలకుల తీవ్రవాద రహిత దేశ లక్ష్యమైనా అది ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డల ప్రశాంత జీవనానికి దోహదపడాలని అభిలషిద్దాం.

Popular Articles