Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘గన్ డౌన్’కు మావోయిస్టులు సిద్ధం!

మావోయిస్టు పార్టీ శాంతి చర్చలను కోరుకుంటోంది. కొన్ని షరతులను విధిస్తూ అందుకు కేంద్ర, వివిధ రాష్ట్రల ప్రభుత్వాలు అంగీకరిస్తే తాము తక్షణ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈమేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదలైంది. వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరుకల్లా నక్సల్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పునరుద్ఘాటిస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ శాంతి చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో చర్చకు దారి తీసింది.

‘‘మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, మావోయిస్టు పార్టీ బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి’ అనే అంశంపై గత నెల 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. ప్రస్తుత స్థితిలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటును, ఆయా సమావేశాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

ప్రజా ప్రయోజనాల కోసం తామెప్పుడూ శాంతి చర్చలకు సిద్ధమేనని, శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నట్లు అభయ్ పేర్కొన్నారు. అయితే ఇందుకు కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణాల్లో చేస్తున్న జీనోసైడ్ (నరసంహారాన్ని)ను నిలిపివేయాలన్నారు.

అంతేగాక సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపేయాలని, తాము చేస్తున్న ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే తాము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామని, శాంతి చర్చలకు మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, హక్కుల సంఘాలు తదితరులందరకీ విజ్ఞప్తి చేస్తున్నట్లు అభయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో, పట్టణాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లోనేగాక, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ ను చేపట్టాలని కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది.

Popular Articles