మావోయిస్ట్ పార్టీకి చెందిన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటేరియట్ మెంబర్, గద్దర్ సమకాలికుడు మాల సంజీవ్ అలియాస్ అశోక్ అలియాస్ లెంగు దాదా, అతని భార్య పెరుగుల పార్వతి అలియాస్ దీనా రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ముందు గురువారం లొంగిపోయారు. ఈ దంపతులిద్దరూ నాలుగున్నర దశాబ్ధాలపాటు మావోయిస్టు పార్టీలో పని చేసినట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
సంజీవ్ 1980లో మావోయిస్టు పార్టీకి చెందిన జననాట్య మండలిలో చేరాడు. గద్దర్ నాయకత్వంలో పనిచేసిన సంజీవ్ అనంతర పరిణామాల్లో మణుగూరు దళంలో పనిచేసి, డివిజనల్ కమిటీ సభ్యునిగా ఎదిగాడు. ఆ తర్వాత ఏటూరునాగారం, పాండవ, మహదేవపూర్ దళాల్లో పని చేశాడు. ఆ తర్వాత 2001లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా, ఉత్తర తెలంగాణా స్పెషల్ జోన్ కమిటీ పరిధిలో పని చేశాడు. అనంతరం 2003లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి బదిలీ అయ్యాడు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం అయిలాపూర్ అడవుల్లో, తాజాగా బీజాపూర్ అడవుల్లోని నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు.

అదేవిధంగా సంజీవ్ భార్య పెరుగుల పార్వతి అలియాస్ దీనా 1992లో నల్లమల ప్రాంతంలోని పీపుల్స్ వార్ గ్రూపు అప్పర్ ప్లాటూన్ దళంలో చేరారు. ఆ తర్వాత పనగల్ దళంలో పనిచేశాక జననాట్య మండలిలో చేరింది. విశాఖ జిల్లా గాలికొండ ఏరియా దళంలో పని చేశాక, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి, ఛత్తీస్ గఢ్ కు బదిలీ అయి అక్కడి చైతన్య నాట్య మంచ్ లో చేరింది. మాల సంజీవ్ ను 2007లో వివాహం చేసుకున్న దీనా ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. మాడ్ డివిజన్ లో జరిగిన ఎన్కౌంటర్ ఘటన నుంచి దీనా తప్పించుకున్నారు.

ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ‘పోరు వద్దు-ఊరు ముద్దు’ పిలుపును పునరుద్ఘాటిస్తున్నట్లు చెప్పారు. అడవుల్లోని నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన కోరారు. తెలంగాణా ప్రభుత్వం లొంగిపోయిన నక్సలైట్లకు అవసరమైన అన్ని పునరావాస కార్యక్రమాలను అందిస్తుందని చెప్పారు. కాలం చెల్లిన సిద్ధంతాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులకు రాచకొండ సీపీ సుధీర్ బాబు పిలుపునిచ్చారు.