గడ్చిరోలి: మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీకి చెందిన 60 మంది సహచరులతో కలిసి వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. అయితే లొంగిపోయిన ఈ 60 మంది నక్సలైట్లలో ఏయే స్థాయి నాయకులు, కేడర్ ఉన్నారనే వివరాలు తెలియరాలేదు. ప్రస్తుత తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లో ఆయుధాలు వదిలేస్తున్నట్లు వేణుగోపాల్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటన, ఆ తర్వాత జగన్ జారీ చేసిన పత్రికా ప్రకటనలపై భిన్న వాదనలు కొనసాగుతున్న పరిణామాల్లోనే 60 మందితో కలిసి అభయ్ మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయినట్లు వస్తున్న వార్తలు ధ్రువపడాల్సి ఉంది. కాగా మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటును స్వాగతిస్తున్నట్లు ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ వర్మ పేర్కొన్నారు.