మావోయిస్టు పార్టీకి చెందిన తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ ఇంఛార్జి జోరిగె నాగరాజు అలియాస్ కమలేష్, అతని సహచరి మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ సహా 13 మంది నక్సలైట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు లొంగిపోయారు. లొంగిపోయిన 13 మంది నక్సలైట్లలో డివిజనల్ కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు, డిప్యూటీ కమాండర్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఇటీవలి కాలంలో ఐదుసార్లు ఎదురుకాల్పుల ఘటనలు జరిగినట్లు చెప్పారు. ఆయా ఘటనల్లో ఆరుగురు నక్సల్స్ చనిపోగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యద్శి రమేష్ లు వారిలో ఉన్నట్లు చెప్పారు. అజ్ఞాతంలో గల నక్సలైట్లు లొంగిపోవాలని, వారికి అన్నిరకాలుగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

ఏపీకి చెందిన ఇరవై మంది నక్సలైట్లు వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్నారని, అందులో ఐదుగురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుల హోదాల్లో ఉన్నట్లు చెప్పారు. ఏడు నెలల్లోగా వారందరూ లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు. విలేకరుల సమావేశంలో ఐజీ (ఆపరేషన్స్) శ్రీకాంత్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వీ రాజశేఖర్ బాబు, ఇంటెలిజెన్స్ ఐజీ రామక్రిష్ణ, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జట్టి, పలువురు ఎస్పీలు పాల్గొన్నారు.
