(‘సమీక్ష’ మార్క్ ప్రత్యేక కథనం)
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి చెందిన 16 మంది నక్సల్స్ అరెస్ట్.. అరెస్టయిన వారి నుంచి ఒక AK-47, రెండు INSAS రైఫిల్స్ సహా పలు తుపాకులను స్వాధీనం చేసుకున్నారనే సారాంశంతో వెలువడిన వార్తా కథనాలు.. పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల్లో అగ్ర నేతలు కూడా ఉన్నారనే ప్రచారంతో కూడిన వార్తలు. ఆ అగ్ర నేతల్లో మావోయిస్ట్ పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారనే ప్రశ్నార్థకంతో కూడిన పత్రికల్లోని వార్తలు. ఇంతకీ అరెస్టయినట్లు పేర్కొంటున్న 16 మందిలో మావోయిస్ట్ పార్టీకి చెందిన అగ్ర నేతలు ఉన్నారా? లేరా? ఇదీ విప్లవోద్యమ అభిమానుల్లోనే కాదు, పరిశీలకుల్లోనూ సాగుతున్న భిన్న చర్చ.
వాస్తవానికి అరెస్టయినట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఘటనను తెలంగాణా పోలీసులు మాత్రం అధికారికంగా ఎక్కడా ధ్రువీకరించలేదు. ఘటనకుపై ఏ సమాచారమైనా ఉన్నతాధికారులే వెల్లడిస్తారని ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. సిర్పూర్ (యు) మండలంలోని పెదదోబ అనే గ్రామంలోని ఓ పూరి గుడిసెలో తలదాచుకున్నట్లు భావిస్తున్న 16 మంది నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో తొమ్మిది మంది మహిళలు కాగా, అరెస్టయినవారంతా ఛత్తీస్ గఢ్ ప్రాంతానికి చెందిన మావోయిస్టులుగా వార్తలు వచ్చాయి. ఇదే దశలో అరెస్టయినట్లు ప్రచారంలో గల మొత్తం నక్సలైట్లలో ఒకరు లేదా ఇద్దరు ముఖ్య నేతలు ఉండవచ్చని తెలుస్తోంది.
అయితే ఈ అగ్రనేత ఎవరన్నదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అరెస్టయిన నక్సల్స్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో మూడు అధునాతన తుపాకులు కూడా ఉన్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. వీటిలో ఒకటి AK-47 కాగా, రెండు INSAS రైఫిల్స్ ఉన్నాయనేది ఆయా వార్తల్లోని ముఖ్యాంశం. సాధారణంగా నక్సల్ గ్రూపుల్లో, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీలో AK-47 తుపాకీని దళ కమాండర్ ఆపైస్థాయి నాయకులే వినియోగిస్తుంటారు. ఒక్కోసారి డిప్యూటీ కమాండర్ స్థాయి నక్సల్ లీడర్ వద్ద కూడా AK-47 తుపాకీ ఉండే అవకాశం ఉంది. అధునాతనంగా భావించే AK-47 తుపాకీని కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయి నాయకుడు కూడా చేబూనుతారని పేర్కొనడంలో అతిశయోక్తి కూడా లేదు.

అదేవిధంగా INSAS రైైఫిల్ కూడా అధునాతన తుపాకీగానే చెప్పవచ్చు. ‘INdian Small Arms System’ అనే పదాల నుంచి క్లుప్తంగా INSASగా పిలిచే ఈ తుపాకీ SLR (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)కు ఎక్కువ, AK-47కు తక్కువగా పోలీసులు అభివర్ణిస్తుంటారు. INSAS రైఫిల్ LMG (లైట్ మెషీన్ గన్) కుటుంబానికి చెందిన ఆయుధం కూడా. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన INSAS రైఫిల్స్ నక్సల్స్ కు బయటి మార్కెట్ నుంచి లభ్యమయ్యే అవకాశమే లేదు. ఏదేని పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన సందర్బంలో, పోలీసులపై పైచేయి సాధించిన ఘటనల్లో నక్సల్స్ తీసుకువెళ్లిన ఆయుధాలు మాత్రమే ఇవి.

ఫైరింగ్ ‘రేంజ్’ ఎక్కువగా పేర్కొనే INSAS రైఫిల్స్ ను ‘ఫైటర్ వెపన్’గానూ అభివర్ణిస్తుంటారు. అవతలి వ్యక్తులతో తలపడే సందర్భంగా వీరోచితంగా పోరాడేవారికి, షార్ప్ షూటర్స్ కు మాత్రమే INSAS రైఫిల్స్ ను పార్టీ నాయకత్వం అప్పగిస్తుందనే ప్రచారం విప్లవ గ్రూపుల్లో ఉంది. ఈ నేపథ్యంలో INSAS రైఫిల్ సాధారణ దళ సభ్యునివద్దనే కాదు, ఇటీవల ఎన్కౌంటర్ లో మరణించి హిడ్మా వంటి నాయకుడి చేతిలోనూ ఉండే అవకాశం లేకపోలేదు. దీంతో ఆసిఫాబాద్ జిల్లాలో అరెస్టయినట్లు పేర్కొంటున్న మొత్తం 16 మందిలో ఏకే-47 వినియోగించే ముఖ్యనేతతోపాటు షార్ప్ షూటింగ్ లో నైపుణ్యం గల ఇద్దరు ‘పైటర్స్’ కూడా ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.
అయితే అరెస్టయినట్లు చెబుతున్న 16 మందిలో అగ్ర నేత, మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారనే ప్రచారానికి ధ్రువీకరణ మాత్రం ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం. దామోదర్ ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లే అవకాశమే లేదంటున్నారు. అదేవిధంగా విజయవాడ నగరంలో ఇటీవలి నక్సల్స్ అరెస్టు ఘటనలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మిస్సయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు అరెస్టయినవారిలో దేవ్ జీ లేరనే అంశాన్ని మావోయిస్ట్ పార్టీ ఇటీవలే ఓ ప్రకనటలో స్పష్టం చేసింది.

కానీ దేవ్ జీ కూడా లొంగిపోనున్నారనే ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరెస్టయిన 16 మందిలో అతను లేడు కదా? అనే ప్రశ్న ప్రామాణికంగానూ చర్చ జరుగుతుండడం గమనార్హం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన దేవ్ జీ ఆసిఫాబాద్ జిల్లాలో కొంతకాలం అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాతే అతను ఛత్తీస్ గఢ్ అడవులకు వెళ్లిపోయారు. దీంతో దేవ్ జీ లొంగుబాటలో పయనించడం నిజమే అయినపక్షంలో.. తాను వెళ్లిన మార్గం నుంచే తిరిగి వచ్చారా? అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా రేకెత్తుతోంది. మొత్తంగా అరెస్టయినట్లు చెబుతున్న 16 మంది నక్సల్స్ లో ఎవరో ఒకరు అగ్ర నేత ఉన్నారనే చర్చను తెలంగాణా పోలీసులు అధికారికంగా వెల్లడించే వివరాలు మాత్రమే ధ్రువపర్చే అవకాశం ఉంది.

