Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

యర్రా శ్రీకాంత్ కు పలువురి నివాళి

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్‌ మృతికి పలువురు నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. సీపీఎం అఖిలభారత 24వ మహాసభల ప్రతినిధిగా మధురై వెళ్లిన శ్రీకాంత్ నిన్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మధురైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన శ్రీకాంత్ భౌతిక కాయాన్ని సోమవారం ఖమ్మం తీసుకువచ్చారు. పార్టీ శ్రేణులు బైక్‌ ర్యాలీగా ప్రకాష్‌ నగర్‌ నుంచి చర్చి కాంపౌండ్‌ మీదుగా మమత హాస్పిటల్‌ కు తీసుకొని వెళ్లారు. అక్కడ బాడీ డీకాంపోజ్‌ కాకుండా రసాయన చర్యలు పూర్తయ్యాక తిరిగి బైక్‌ ర్యాలీగా సీపీఎం జిల్లా కార్యాలయానికి తీసుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు, సీపీఐ (ఎం) కార్యకర్తలు, శ్రీకాంత్‌ అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సంతాప సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలకు, పార్టీకి యర్రా శ్రీకాంత్‌ మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీన పార్టీ అఖిలభారత మహాసభలకు ఎంతో ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళామని, అంతలోనే శ్రీకాంత్‌ అకాల మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌ రావు అన్నారు. అఖిలభారత మహాసభలకు మొదటిసారి ప్రతినిధిగా ఎంపిక కావడంపై శ్రీకాంత్‌ ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చారని, కానీ అవే తన చివరి మహాసభలు అవుతాయని ఊహించలేకపోయామని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

నివాళులు అర్పిస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు

యర్రా శ్రీకాంత్‌ కు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించినవారిలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి క్యాంప్‌ కార్యాలయ ఇన్చార్జ్‌ తుంబూరు దయాకర్‌ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సీపీఐ (ఎం.ఎల్‌) మాస్‌లైన్‌ నేత గుర్రం అచ్చయ్య తదితరులు ఉన్నారు.

సంతాప సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర, చిత్రంలో సీపీఎం నాయకులు పోతినేని, నున్నా నాగేశ్వర్ రావు కూడా ఉన్నారు

అంతేగాక టీడీపీ జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్‌, ప్రజా ఫ్రంట్‌ జిల్లా కార్యదర్శి దేవరెడ్డి విజయ్‌, సీపీఐ (ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకులు మధు, వంగూరిరాములు, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్‌, వై.విక్రమ్‌, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, సీనియర్‌ నాయకులు పి.సోమయ్య, ఎం.సుబ్బారావు, తాతా భాస్కర్‌రావు, బత్తినేని వెంకటేశ్వరరావు, బిల్డింగ్‌ వర్కర్స్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌.కోటంరాజు, డాక్టర్‌ సి.భారవి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అఫ్రోజ్‌ సమీనా, సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు, ఎస్కే ఖాసీం, గిరి, కోలా లక్ష్మీనారాయణ, సిపిఐ (ఎం.ఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్‌, టీఆర్ఎస్ నగర కార్యదర్శి పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, అన్నం సేవా ఫౌండేషన్‌ శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, జిల్లా ప్రజా సంఘాల బాధ్యులు, వివిధ ప్రజా సంఘాల నేతలు తదితరులు సంతాపం తెలిపారు.

Popular Articles