Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

‘గులాబీ కోట’లో వెరీ ‘ఇంటెలిజెంట్’!

మన్నె క్రిశాంక్.. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు మారుమోగుతున్న పేరు ఇది. ప్రత్యర్థి పార్టీలను సోషల్ మీడియా వేదికగా ఉక్కిరిబిక్కిరి చేయడంలో ప్రసిద్ధి గాంచిన ప్రముఖునిగా మన్నె క్రిశాంక్ తరచూ వార్తల్లోకి రావడమే కాదు, సంచలనాత్మక వార్తా కథనాల్లోనూ వ్యక్తిగా నిలుస్తున్నారు. తాజాగా కంచ గచ్చబౌలి భూముల వివాదంలో ఏఐ ద్వారా ‘కల్పిత’ వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేసి తెలంగాణా ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా బద్నాం చేశారనే అభియోగాలను క్రిశాంక్ ఎదుర్కుంటున్నారు. ఈమేరకు క్రిశాంక్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. నేటి నుంచి వరుసగా మూడు రోజులపాటు తమ ముందు విచారణకు హాజరు కావాలని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.

ఇంతకీ ఎవరీ క్రిశాంక్..? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేవలం విపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకుడి బాధ్యతల్లో మాత్రమేనా? కాంగ్రెస్ పార్టీపై పాత పగ ఏదైనా క్రిశాంక్ లో దాగి ఉందా? ఇదీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ. నిజానికి మన్నె క్రిశాంక్ తెలంగాణా ఉద్యమకారుడు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జరిగిన మలిదశ ఉద్యమంలో క్రిశాంక్ చురుకైన పాత్రను పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ లీడర్ గానూ పనిచేశారు.

అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం క్రిశాంక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ ను సాధించారు కూడా. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరో అభ్యర్థికి బీ ఫారం ఇవ్వడం గమనార్హం. అయినప్పటికీ క్రిశాంక్ నిరాశ చెందలేదు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో అధికార పక్షంపై పోరాడారు. ఈ నేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందని ఆశించినా ప్రయోజనం లేకపోయింది. టికెట్ నిరాకరణకు గురైన క్రిశాంక్ మనస్తాపంతో 2019 మార్చిలో కాంగ్రెస్ ను వీడి అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ లో చేరారు.

మన్నె క్రిశాంక్ మేథాశక్తిని పసిగట్టిన గులాబీ పార్టీ ఆయనను సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించింది. క్రిశాంక్ కన్వీనర్ గా పార్టీ సభ్యుల, కమిటీల డేటాబేస్ తోపాటు, పార్టీ వెబ్ సైట్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తదితర బాధ్యతలను నిర్వహించారు. ప్రభుత్వంపై విపక్షాలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడంలో, ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ తదితర విభాగాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో క్రిశాంక్ సక్సెస్ అయ్యారు.

ఇందుకు ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం క్రిశాంక్ ను 2021 డిసెంబర్ 15వ తేదీన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో క్రిశాంక్ ప్రస్తుతం ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. గులాబీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా క్రిశాంక్ వివాదాస్పద లీడర్ గానూ వార్తల్లో నిలిచారు. మార్ఫింగ్, ఏఐ క్రియేషన్ ద్వారా అధికార పక్షంపై తయారైన వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగాలను ఎదుర్కుంటున్నారు.

తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలోనూ మన్నె క్రిశాంక్ పేరు మార్మోగుతోంది. తెలంగాణాలో అధికారంలో గల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా బద్నాం చేయడంలో సోషల్ మీడియాను క్రిశాంక్ సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారనేది పోలీసుల అభియోగం. సోషల్ మీడియాలో క్రిశాంక్ ఫేక్ వీడియోలను వైరల్ చేసినట్లు పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అటవీ అధికారులు, ఎన్ఎస్ యూఐ నాయకులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఈమేరకు క్రిశాంక్ పై ఫిర్యాదులు చేశారు. వివిధ వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా, ఉద్రిక్తలను సృష్టించేలా క్రిశాంక్ వ్యవహరించారనేది ఫిర్యాదుల సారాంశం.

దీంతో గచ్చిబౌలి పోలీసులు క్రిశాంక్ పై మూడు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని కోరుతూ మన్నె క్రిశాంక్ హైకోర్టులో వేర్వేరుగా క్వాష్ పిటిషన్లను దాఖలు చేయగా, హైకోర్టు అందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేస్తూనే, ఈ కేసులో క్రిశాంక్ కు బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35 కింద నోటీసు ఇచ్చి విచారణ జరపాలని నిన్న ఆదేశించింది. కేసు విచారణను నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.

కేసీఆర్, కేటీఆర్ లతో మన్నె క్రిశాంక్ (ఫైల్)

వాస్తవానికి ఇటువంటి వివాదాస్పద కేసులు మన్నె క్రిశాంక్ కు కొత్తేమీ కాకపోవడం గమనార్హం. కొన్ని కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు ఏడాది క్రితమే ‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో క్రిశాంక్ జైలుకు వెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కటకట ఉందని, హాస్టళ్లను మూసివేస్తున్నారని ప్రచారం చేయడంతోపాటు ఓయూ సర్క్యులర్ ను మార్ఫింగ్ చేశారని ఓయూ చీఫ్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిరుడు మే 1వ తేదీన క్రిశాంక్ ను అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజులపాటు ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే అదే నెల 11వ తేదీన షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో క్రిశాంక్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

ఎమ్మెల్సీ కవితతో మన్నె క్రిశాంక్ (ఫైల్)

మొత్తంగా కంచ గచ్చబౌలి భూముల వివాదంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా దేశ వ్యాప్తంగా బద్నాం అయ్యిందనేది కాదనలేని వాస్తవం. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పలు పోస్టులను ఏఐ కల్పిత వీడియోలుగా సైబర్ క్రైం పోలీసులు తేల్చారు. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలతోపాటు అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులను అప్రమత్తమై తొలగిస్తున్నారు. మరోవైపు ఫేక్ వీడియోల పోస్టుల వైరల్ అంశంలో మన్నె క్రిశాంక్ పేరు తీవ్ర స్థాయిలో వివాదస్పదమైన నేపథ్యానికి ఫిర్యాదులు, కేసుల నమోదు తార్కాణంగా నిలుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తనకు 2014 ఎన్నికలలో టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మరొకరికి బీ ఫారం కేటాయించడం, 2018 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితుల్లో అప్పట్లో మనస్తాపానికి గురైన మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ పార్టీపై ఎడతెగని కసిని పెంచుకున్నారా? బీఆర్ఎస్ సోషల్ కన్వీనర్ బాధ్యతల్లో ఈమేరకు క్రిశాంక్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారా? అనే ప్రశ్నలపై రాజకీయంగా భిన్న చర్చ జరుగుతోంది. క్రిశాంక్ పై నమోదవుతున్న కేసుల్లోని అభియోగాలపై నిజానిజాలు కోర్టుల విచారణలో తేలాల్సి ఉన్నప్పటికీ, అతని మేథాశక్తిని సమర్థంగా వాడుకోవడంలో మాత్రం బీఆర్ఎస్ సత్ఫలితాలు సాధిస్తోందనే వ్యాఖ్యలు మాత్రం ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

Popular Articles