Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘మంచు’కోట రహస్యం.. అసలేం జరుగుతోంది!?

“జగమేమాయ.. బతుకే మాయ.. వేదాలలో సారమింతేనయా” పాట గుర్తుకొచ్చింది. చిన్న వయసులోనే మంచు మనోజ్ కు జీవన సారం బాగా అర్ధమయ్యింది. జల్ పల్లిలో మంచు మోహన్ బాబు ఇంటి బయట గేటు పక్కన తువ్వాలు పరచుకుని గోడకు అనుకుని కూర్చుండి పోయాడు మంచు మనోజ్ బుధవారం పగలు 12 గంటలకు నీరసంగా.. నిర్వేదంగా.

భారత దేశంలోనే తనను మించిన నటుడు లేడని తనకు తానే ధైర్యంగా చెప్పుకున్న మంచు మోహన్ బాబు ఇంట్లో లొల్లి మళ్ళీ మొదలైంది. తన కారు, ఇంట్లో సామాన్లు బయట పడేశారని, తనకు న్యాయం చేయాలంటూ నేరుగా మోహన్ బాబు ఇంటి ముందు కూర్చున్నాడు మనోజ్. ఈ ఎండకు పైన ఏ టెంటు లేదు. ఏ చెట్టు నీడ లేదు పాపం.

బహుశా ఒక్క మోహన్ బాబు కుటుంబంలోనే ఇది సాధ్యమైంది. పల్లెల్లో కుటుంబ తగదాలు ఎలా ఉంటాయో చెప్పక్కరలేదు. నగరాల్లో గొడవలు భిన్నం. అందునా సెలబ్రిటీల కుటుంబ గొడవలు విభిన్నం. అత్తారింటి ముందు కోడళ్ల నిరసనలు ఇన్నాళ్లు చూసాం. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తండ్రి ఇంటి ముందు, తండ్రి ఉండగానే.. కుమారుడు నిరసన తెలియచేయడం ఇదే మొదటి సారి అయివుంటుంది. ఆ క్రెడిట్ మోహన్ బాబు కుటుంబానికి దక్కింది. గేటుకు పెద్ద తాళం వేశారు. ఫుల్లు సెక్యూరిటీ. గేటు బయట నేలపై మంచుమనోజ్. అసలు ఏం జరుగుతోందో ఏమో!

ఇంతకీ మంచు కుటుంబం గొడవేంటో ఎవ్వరికీ తెలియదు. మోహన్ బాబు పోలీసులతో చెప్పిన విషయాలకు, మనోజ్ చెప్పే విషయాలకు పొంతన ఉండటం లేదు. మంచు విష్ణేమో అసలేం లేదు అంటాడు, వుందంటాడు, కొడతాడు, కొట్టిస్తాడు, తనకేం తెలియదు కన్నప్ప సినిమాలో బిజీ అంటుంటాడు. మంచు లక్ష్మికి అర్ధమై ఉంటుంది కానీ, ఏం చేయాలో తెలియక ముంబై లో చిల్ అవుతోంది. అసలు చెప్పాల్సిన మనోజ్ తల్లి మాత్రం నోరు విప్పడం లేదు. సినిమా ఇండస్ట్రీలో కలగజేసుకుని సమస్య పరిష్కరించే ధైర్యం ఒక్కరికీ లేదు. ఒడ్డున కూర్చుని భయం భయంగా చూస్తున్నారు.

జల్ పల్లి ఇంటి దగ్గర పోలీసులు భారీ గా మోహరించారు. విష్ణు, మోహన్ బాబు, మనోజ్ ముగ్గురి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు పోలీసుల కన్నా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తానికి ఉద్రిక్తత నెలకొని వుంది. త్వరగా అటో, ఇటో, ఎటో తేల్చుకోండి.. అంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు ఎదురు చూస్తున్నారు. జనం తమాషా చూస్తున్నారు. సమ్మర్ లో కూడా ‘మంచు’ కరగకపోవడం ఏమిటి స్వామీ!?

– డా. మహ్మద్ రఫీ

Popular Articles