హైదరాబాద్: ‘మన తొలివెలుగు’ యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు గంజి రఘు కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు హాజరయ్యాడు. సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య అరెస్ట్ నేపథ్యపు పరంపరలోనే రఘును ఎన్ఐఏ విచారణకు పిలిచింది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల్లో చేసిన ప్రసంగపు అంశంలో గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ‘మన తొలివెలుగు’ ఛానల్ నిర్వాహకుడు రఘుకు, రిపోర్టర్ అనిల్ కు వేర్వేరుగా ఎన్ఐఏ అధికారులు నిన్న నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు.
ఈమేరకు మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటల నుంచి వీరిద్దరినీ గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయంలో అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తనను మూడున్నర గంటలపాటు విచారించారని, తమ రిపోర్టర్ అనిల్ విచారణ ఇంకా కొనసాగుతోందని ఎన్ఐఏ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత రఘు తెలిపాడు. ఎన్ఐఏ అధికారులకు వాంగ్మూలం ఇచ్చానని, వారు అడిగిన సమాచారం అందించినట్లు రఘు పేర్కొన్నాడు. తన లాయర్ సహా రఘు ఎన్ఐఏ విచారణకు హారయ్యాడు.

