ఎవరో అత్తిలి చిదంబరానంద స్వామి అటమ్మా.. మొత్తం గీకేశాడు.. అంటూ తన గుండును ఎమ్మెల్యే సతీమణికి చూపిస్తుంది ఓ మహిళ.. ఇందుకు స్పందనగా నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మా.. అంటూ కన్నీటితో తనకూ గీసిన బోడి గుండు చూపిస్తూ వాపోతుంది ఎమ్మెల్యే భార్యగారు.. ఇది సూపర్ హిట్ సినిమా విక్రమార్కుడులో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పండించిన కామెడీ సీన్..
సరిగ్గా ఇదే సీన్ హైద్రాబాద్ పాతబస్తీలో రిపీట్ అయ్యింది. బట్టతలకు జుట్టు మొలిపిస్తా.. అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశాడు ఢిల్లీకి చెందిన వకీల్ సల్మానీ అనే వ్యక్తి. తాను బిగ్ బాస్ ఫేమ్ కు కూడా బట్టదలపై జుట్టు మొలిపించానని చెప్పాడు. తాను హైదరాబాద్ వస్తున్నానని, తన స్నేహితునికి పాతబస్తీలో గల సెలూన్ కు బట్టతల బాధితులు రావచ్చని ప్రచారం చేశాడు.

ఇదంతా నిజమేనని నమ్మిన వందలాది మంది బట్టతల భాదితులు మొన్న పాతబస్తీకి వచ్చిన వకీల్ సల్మానీ దగ్గరకు పోలోమంటూ క్యూ కట్టారు. ఇక వాళ్ళందరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు వకీల్ సల్మానీ. కోర్సులో భాగంగా మొదట అందరికీ గుండు గీకేశాడు. అనంతరం బోడి గుండుపై ఏదో కెమికల్ రాసేశాడు.
ఆ తర్వాత కస్టమర్లకు ఫుల్ భరోసానిస్తూ హెయిర్ వస్తుందంటూ ఇంటికి పంపించాడు. ఇంకేముందు జుట్టు మొలిచే ఉంటుందని అనుకుంటున్నారా? అదే ట్విస్టు మరి. సీన్ కట్ చేస్తే.. హెయిర్ పెరగలేదు సరికదా.. ఉన్న జుట్టూ కనీసం మొలకెత్తలేదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ తో నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి ఆస్పత్రి పాలు కాక తప్పలేదు బట్టతల బాధితులకు. ఇక ఈ ఘటనపై భాదితులు మాత్రం పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదుట.

ఇదే అదునుగా వకీల్ సల్మానీ పెట్టే, బేడా సర్దుకుని ఎంచక్కా పరారయ్యాడు. ఇంతకీ గుండు గీకి ఆయిల్ రాసినందుకు ఒక్కొక్కరి వద్ద వకీల్ సల్మానీ వసూల్ చేసిన మొత్తం ఎంతో తెలుసా? గుండుకు రూ. 200, ఆయిల్ రాసే బ్రష్ కోసం రూ. 20.. వెరసి మొత్తం రూ. 220 వసూల్ చేసి జంప్ అయ్యాడు.

మొత్తం ఎపిసోడ్ లో అసలు కొసమెరుపు ఏమిటంటే.. వకీల్ సల్మానీ చేత గుండు గీయించుకుని ఆయిల్ పూయించుకున్న బాధితులు నెత్తినై ఏదో రియాక్షన్ మొదలై, మంటలతో బొబ్బలు రావడంతో పెడబొబ్బలు పెడుతూ ఆసుపత్రికి పరుగులంకించుకున్నారు.
అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. వైద్య నిపుణుల వాదన ప్రకారం.. ఇప్పుడు తీసుకునే కెమికల్ ఫుడ్డుకి, టెన్షన్లకు, వాతావరణ పరిస్థితులకు బట్ట, పొట్ట కామన్. అందం కోసం ఆరాటపడి ఇలాంటి బురిడీగాళ్ల మాయలో పడితే అందవికారంగా మారుతారు తస్మాత్ జాగ్రత్త సుమీ.

