హైదరాబాద్: ప్రభుత్వ అధికారులు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను సాధారణంగా అవినీతి నిరోధక శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడిస్తుంది. ఆదాయానికి మించి అధికారులు కూడబెట్టినట్లు దాడుల్లో, తనిఖీల్లో కనుగొన్న ఆయా ఆస్తుల డాక్యుమెంటరీ విలువను వెల్లడిస్తూనే, ఓపెన్ మార్కెట్ లో వాటి విలువను ఓ అంచనాగా చెబుతుంది. అయితే మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్ నాయక్ ఇంట్లో సోదాలు జరిపి అనంతరం, అతనికి చెందినవిగా వెల్లడించిన ఆస్తుల ఫొటోలను ఏసీబీ విడుదల చేయడం విశేషం.

సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని డీటీసీ కిషన్ ఇంట్లో సోదాల నిర్వహణ, అతనికి చెందిన కుటుంబ సభ్యుల, స్నేహితుల నివాసాల్లో, ఇతర ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో గుర్తించిన భారీ ఆస్తులకు సంబంధించిన దృశ్యాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. డాక్యుమెంటరీ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ. 12.72 కోట్లుగా ఏసీబీ వెల్లడించింది. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ నాలుగైదు రెట్లు అధికంగా ఉంటుందని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ప్రకటించారు. అయితే ఇది వందల కోట్లలో ఉండవచ్చనే ప్రచారం మరోవైపు జరుగుతోంది. తెలంగాణాలో ఇప్పటి వరకు ఏసీబీ గుర్తించిన ప్రభుత్వ అధికారుల ఆస్తుల్లో ఇవే అత్యధికంగా వార్తలు వస్తున్నాయి. డీటీసీ కిషన్ అక్రమంగా కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించి విడుదల చేసిన ఆయా ఆస్తుల చిత్రాలను దిగువన తిలకించండి..





