Top 5 This Week

Related Posts

మఫసిల్ ఎడిటర్ లక్ష్మణ్ రావు హఠాన్మరణం

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, మఫసిల్ ఎడిటర్ గా ప్రసిద్ధిగాంచిన టీకే లక్ష్మణ్ రావు (70) మంగళవారం హఠాన్మరణం చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న లక్ష్మణ్ రావు ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో తన నివాసంలోనే కన్ను మూశారు. లక్ష్మణ్ రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్, సాక్షి అసోసియేట్ ఎడిటర్ గా పదవీ విరమణ చేసిన టి. వేణుగోపాల్ లక్ష్మణ్ రావు సోదరుడే. ఆయనకు మరో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.

ఉదయం దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించిన లక్ష్మణ్ రావు విలేకరులు రాసిన వార్తలకు పదునైన శీర్షికలు పెట్టడంలో ప్రసిద్ధి గాంచారు. గ్రామీణ వార్తలను సరిదిద్ది, ప్రచురణకు అనుమతించే బాధ్యతలను నిర్వహించేవారిని పత్రికా భాషలో మఫసిల్ ఎడిటర్ అంటారు. వార్త దినపత్రికలో లక్ష్మణ్ రావు మఫసిల్ ఎడిటర్ గా విశేషంగా పేరు గడించారు. ‘సాక్షి’ దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

సాక్షి పత్రిక ఫౌండర్ ఎడిటర్ దివంగత కేఎన్ వై పతంజలి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేసిన సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి ప్రముఖులతో లక్ష్మణ్ రావు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. లక్ష్మణ్ రావు ఆకస్మిక మృతిపట్ల ‘సమీక్ష’ న్యూస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటోంది.

Popular Articles