Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సామాజిక భద్రత కల్పించాలి: మేళ్లచెర్వు

అమెరికా వంటి విదేశాల తరహాలోనే మనదేశంలో కూడా ప్రజలకు సోషల్ సెక్యూరిటీని కల్పించాల్సిన అవసరముందని ఎల్ పీ జీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తెలంగాణా రాష్ట్ర తొలి అధ్యక్షుడు, ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ అధినేత మేళ్లచెర్వు వెంకటేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వ బాధ్యతగానూ ఆయన నిర్వచించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో 2025-26 బడ్జెట్ అనంతర మేధావులతో చర్చ జరిగింది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మేళ్లచెర్వు వెంకటేశ్వర్ రావు పలు అంశాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు.

అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సీనియర్ సిటిజన్లకు కల్పిస్తున్నటువంటి సామాజిక భద్రతను మనదేశంలోనూ కల్పించాలని వెంకటేశ్వ్ రావు కోరారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి జీవితకాలం పన్నులు చెల్లించిన ఆరు పదుల వయస్సు నిండినవారికి సోషల్ సెక్యూరిటీ కల్పించాలని, ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లాలని అభ్యర్థించారు. అరవై ఏళ్ల వయస్సు నిండినవారు ఏ అసుప్రతికి వెళ్లినా ఉచిత చికిత్స కల్పించడం, ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఏ రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకున్నా ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి సదుపాయాలు సోషల్ సెక్యూరిటీవల్ల లభిస్తాయన్నారు. మనదేశంలో కూడా సోషల్ సెక్యూరిటీ కల్పిస్తే శేషజీవితంపై ప్రజలకు భరోసా కలుగుతుందని, ఆస్తులపై మమకారం తగ్గుతుందని, నేరాల సంఖ్య తగ్గడమేగాక, మనుషుల స్వార్థపూరిత యోచనల్లోనూ మార్పు వస్తుందని, ఇది ప్రభుత్వ బాధ్యతగా మేళ్లచెర్వు అభిప్రాయపడ్డారు.

పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో మేళ్లచెర్వు వెంకటేశ్వర్ రావు

అదేవిధంగా ఉజ్వల యోజన కింద నిరుపేదలకు కల్పిస్తున్న వంట గ్యాస్ పథకంలో ట్రాన్స్ ఫర్ ఓచర్స్ ఇవ్వాలని మేళ్లచెర్వు కోరారు. గ్యాస్ బదిలీ అవకాశం లేకపోవడంతో పనుల కోసం ఇతర ప్రాంతాలు వలస వెళ్లిన పేదలు గ్యాస్ కోసం నానా ఇబ్బందులు పడుున్నారని చెప్పారు. తమ వెంట సిలిండర్, రెగ్యులేటర్ ను తీసుకువెళ్లి, వలస వెళ్లిన ప్రాంతాల్లో స్థానికంగా ఏదోరకంగా సిలిండర్లు తీసుకుంటున్నారని అన్నారు. సాంకేతికంగా ఇది తప్పిదం కాకపోయినా, లీగల్ గా మాత్రం ఇబ్బందికర పరిణామమని అన్నారు. అందువల్ల ఉజ్వల యోజన లబ్ధిదారులకు ట్రాన్స్ ఫర్ ఓచర్ సౌకర్యం కల్పించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ను కోరారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రో బడ్జెట్ మధ్య తరగతివారికి అనుకూలమని, ఇది మంచి మార్పుగా మేళ్లచెర్వు వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు.

Popular Articles