తెలంగాణాలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణి కుముదిని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. మొత్తం ఐదు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
ప్రతి ఎన్నికల దశకు పదిహేను రోజుల వ్యవధి చొప్పన ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని చెప్పారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. నవంబర్ 11వ తేదీన స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు.

- అక్టోబర్ 23వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి.
- అక్టోబర్ 27వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
- అక్టోబర్ 17వ తేదీన సర్పంచ్ స్థానాలకు విడుదల కానున్న తొలి విడత ఎన్నికల షెడ్యూల్.
- అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికలు తొలి విడత పోలింగ్ జరగనుంది.
- అక్టోబర్ 21వ తేదీ నుంచి సర్పంచ్ ఎన్నికలకు రెండో విడత నామినేషన్లు స్వీకరించనున్నారు.
- నవంబర్ 4వ తేదీన సర్పంచ్ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది.
- అక్టోబర్ 25వ తేదీ నుంచి సర్పంచ్ ఎన్నికలకు మూడో విడత నామినేషన్లు స్వీకరించనున్నారు.
- నవంబర్ 8వ తేదీన సర్పంచ్ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరగనుంది.
- నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

