జిల్లా వ్యాప్తంగా రెండు రోజులపాటు మద్యం విక్రయాలు నిలిపేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లిక్కర్ వ్యాపారులను ఆదేశించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కాంపౌండ్లు మూసివేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా రెండు రోజుల పాటు మూసివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.
అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS యాక్ట్ కూడా అమలులో ఉంటుందని చెప్పారు. 25వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అంక్షలు అమలులో ఉంటయన్నారు. అందువల్ల ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు. ఎవరూ రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం చేయరాదన్నారు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా, అతిక్రమించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎక్కడైనా డబ్బు, మద్యం ఉచిత కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయకూడదని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. ఎన్నికలలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తెలిపారు.

