(సమీక్ష ప్రత్యేకం)
ఆఫ్రికా దేశం ఇథిపియాలో 20 ఏళ్ల క్రితం జరిగిందీ యదార్థ ఘటన. రాజధాని అడిస్ అబాబాకు నైరుతి (సౌత్ ఈస్ట్) దిశలో 550 కి.మీ. దూరంలోని బిటా గెనెట్ (Bita Genet) అనే టౌన్ కిడ్నాప్ వార్తతో ఉలిక్కిపడింది. ఒక 12 ఏళ్ల బాలిక స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఐదారుగురు సభ్యుల ముఠా కిడ్నాప్ చేసి సమీపంలో అడవుల గుండా తీసుకెళ్తోంది. చిన్న పిల్లలను వయసు మళ్లిన పురుషులు పెళ్లి చేసుకోవడానికి విక్రయించడం ఇథియోపియాలో ఒక వ్యాపారంగా నడుస్తోంది. రోడ్డుపై వెళ్తే పోలీసులు పట్టుకుంటారనే భయంతో కిడ్నాపర్లు గడ్డి మైదానాల గుండా బాలికను బెదిరించి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు.
ఎలా చూశాయో ఏమో గాని, అకస్మాత్తుగా మూడు సింహాలు వారి వెంట పడ్డాయి. తృటిలో తప్పించుకున్న కిడ్నాపర్లు బాలికను వదిలి పారిపోయారు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లే దశలో ఉన్న బాలిక నుంచి చిన్న మూలుగులు మాత్రమే వినిపిస్తున్నాయి. క్రూర స్వభావం గల సింహాలేవీ ఆమెకు హాని తలపెట్టకుండా రెండు రోజులు కాపలాగా ఉన్నాయి. పోలీసులు, బాలిక బంధువులు అక్కడికి చేరుకునేటప్పటికి ఆమె సింహాల మధ్య పడుకుని ఉంది. వారిని చూసి అవి దూరంగా వెళ్లిపోగా ఆమెను ఆసుపత్రికి తరలించారు..
ఈ ఘటన ప్రపంచంలోని క్రూర మృగాల ప్రవర్తనను అధ్యయనం చేసే జువాలజిస్టులు, జంతు సంరక్షుకుల దృష్టిని ఆకర్షించింది. అనేక మంది బాలిక ఉండే బిటా గెనెట్ కు బయల్దేరి వచ్చారు. ఆమె సింహాల సంరక్షణలో ఉండగా చూసి తీసుకొచ్చిన వారందరిని రోజుల తరబడి ఇంటర్వ్యూలు చేశారు.
వారు చెప్పిందేమిటంటే… నిస్సత్తువలో ఉన్న బాలిక చేసిన రోదనలు, మూలుగులు ప్రాణాపాయంలో ఉన్న సింహం కూనలు చేసే శబ్దాల్లాగా ఉన్నాయి. సాధారణంగా పెద్ద జంతువులన్నీ పిల్లలను, పెద్దలను పోల్చుకోగలవు. రూపం, ముఖ కవలికలు, ఏడుపులు, పరుగెత్తలేని నిస్సహాయతను అవి అర్థం చేసుకుంటాయట. అందువల్లే సింహాలు బాలికను కాపాడి రక్షణగా ఉన్నాయని తేల్చారు. అంతకు ముందే అవి ఏదైనా జంతువును వేటాడి కడుపునింపుకుని ఉండటం వల్ల బాలిక వాటికి ఆహారంగా కనిపించి ఉండక పోవచ్చనే నిర్దారణకు వచ్చారు.
గతంలో అటవీ ప్రాంతాలో ఉండే గ్రామాల పిల్లలు దగ్గరగా వెళ్లినా సింహాలు వారిని పట్టించుకోకుండా వెళ్లిన సందర్బాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బాలికను రెండ్రోజుల పాటు కాపలాకాసి హైనాలు, తోడేళ్ల నుంచి రక్షణ కల్పించాయి. అదీ విశేషం.
credit: The Guardian, Nofi, one planet

✍️ బి.టి. గోవిందరెడ్డి

