Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

జంట హత్యల కేసులో జీవిత ఖైదు

సత్తుపల్లి: జంట హత్యల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదుతోపాటు రూ. 25 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా జడ్జి మారగని శ్రీనివాసరావు శుక్రవారం తీర్పు చెప్పారు. తల్లీ, కొడుకుల గొంతుకోసి అమానుషంగా హత్య చేసిన ఈ ఘటన అప్పట్లో సత్తుపల్లి ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..

సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన దర్శనపు సునీల్ అలియాస్ మహేష్ (23) అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవిస్తుండేవాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన రాయల తులశమ్మ పెన్షన్ డబ్బులు కోసం సత్తుపల్లి బ్యాంక్ కు వెళ్ళి తిరిగి నారాయణపురంలోని తన ఇంటికి వెళ్లేందుకు 2023 జూలై 31వ తేదీన సునీల్ నడుపుతున్న ఆటోను ఆపి రూ. 100 మొత్తం కిరాయి చెల్లించేవిధంగా మాట్లాడుకుంది. ఈ క్రమంలోనే పట్టణంలోని పాత సెంటర్ లోని లక్ష్మీనారాయణ జనరల్ స్టోర్ వద్ద ఆటోను ఆపి కిరాణా సరుకులు, బియ్యం మూట తీసుకుని తులశమ్మ బయలుదేరింది. ఈ సందర్భంగా కిరాణా షాపులో డబ్బులు ఇచ్చేందుకు తులశమ్మతన పర్సులో నుంచి డబ్బులు తీస్తుండగా రూ.500 నోట్ల కట్టను డ్రైవర్ సునీల్ గమనించాడు.

ఆటో నడుపుతూ అక్రమ సంపాదనకు అలవాటుపడిన సునీల్ తులశమ్మ పర్సులో చూసిన నగదును రాత్రికి దొంగతనం చేయాలని పన్నాగం పన్నాడు. తులశమ్మను ఆటోలో గ్రామంలోకి తీసుకువెళ్తే దొంగతనం చేశాక తనను గుర్తుపట్టే అవకాశం ఉందని భావించి, కాకర్లపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆటో ఆపి తనకు కిరాయి గిట్టుబాటు కాదని, వేరే ఆటో చూసుకుని వెళ్లవలసిందిగా నమ్మబలికాడు. ఆమె అదే విధంగా మరో ఆటోను మాట్లాడుకుని ఇంటికి చేరింది.

తాను వేసుకున్న పథకం ప్రకారం సునీల్ అర్ధరాత్రి తులశమ్మ ఇంట్లో దొంగతనానికి బయలుదేరాడు. ఎవరైనా అడ్డువస్తే చంపేయాలని కూడా నిర్ణయించుకుని గడ్డికోసే కొడవలి వెంట తీసుకువెళ్ళాడు. తులిశమ్మ ఇంటి తలుపులు గడివేయకుండా మూసి ఉండడంతో తేలిగ్గానే సునీల్ ఆమె ఇంటిలోకి ప్రవేశించాడు. ముందు గదిలో మంచంపై తులశమ్మ నిద్రిస్తుండగా, వెనక గదిలో మతిస్థిమితం లేని ఆమె కొడుకు రాయల సత్యనారాయణ మరో మంచంపై నిద్రిస్తున్నట్లు గమనించి గొంతు కోసి అమానుషంగా ఇద్దరినీ హత్య చేశాడు.

ఘటనపై ఫిర్యాదును స్వీకరించిన సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన సునీల్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం అభియోగం పత్రం దాఖలు చేసి, అవసరమైన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నిందితుడైన సునీల్ ను దోషిగా తేలుస్తూ, అతనికి జీవిత ఖైదుతోపాటు రూ. 25 వేల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీనివాసరావు తీర్పు చెప్పారు. దోషికి శిక్ష పడేాలా విధులు నిర్వర్తించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ కే అబ్ధుల్ భాషా, అప్పటి విచారణాధికారులైన సీఐ జె. మోహన్ బాబు, టి. శ్రీహరి, సీడీవో వి. నరేష్, ఎస్ఐ కె. శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ డి. నాగేశ్వర్ రావు, కానిస్టేబుల్ కె. శ్రీనివాసరావులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles