ఛత్తీస్ గఢ్: మావోయిస్టుల లొంగుబాటు పర్వంలో ఇదో చారిత్రక ఘట్టంగా ఛత్తీస్ గఢ్ పోలీసులు అభివర్ణిస్తున్నారు. మావోయిస్టులకు పెట్టని కోటగా ప్రాచుర్యం పొందిన ప్రాంతంలోని ఆ పార్టీ నెట్ వర్క్ చివరి అవశేషాలను నిర్వీర్యం చేశామని భావిస్తున్నారు. ఒకప్పుడు ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలను కలిపే రెడ్ కారిడార్ హాట్ స్పాట్ గా పేరుగాంచిన గరియాబంద్ ఇప్పుడు నక్సల్ రహిత ప్రాంతంగా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. గరియాబంద్ జిల్లాలోని చివరి క్రియాశీల మావోయిస్ట్ నాయకుడు సునీల్ అలియాస్ జగ్తార్ సింగ్ ఏడుగురు సహచరులతో కలిసి ప్రభుత్వానికి లొంగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
సమన్వయంతో కూడిన నిఘా, ప్రభుత్వ పునరావాస విధానాల మావోయిస్టుల నెట్ వర్క్ చివరి అవశేషాలను ఇక్కడ నిర్వీర్యం చేసిందంటున్నారు. ఇప్పుడు గరియాబంద్ ప్రాంతం మావోయిస్టుల కదలికలు లేని ప్రాంతంగా పేర్కొంటున్నారు. శుక్రవారంనాటి సునీల్ దండు మావోయిస్టు నక్సల్స్ లొంగుబాటు ఘటన చరిత్రాత్మకంగా పేర్కొంటూ, గరియాబంద్ జిల్లాలో వ్యవస్థీకృత మావోయిస్టు కార్యకలాపాలకు ఈ దృశ్యం ముగింపు పలికిందంటున్నారు. ఇంతకీ ఎవరీ సునీల్ ఏమా కథ..?

హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని తండాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి సునీల్. ఇతని తలపై ప్రభుత్వం రూ. 8 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. గడచిన రెండు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా సునీల్ పాల్గొన్నాడు. శుక్రవారం గరియాబంద్-ధమ్తారి-నువాపాడ డివిజన్ పరిధిలోని ఉదంటి ఏరియా కమిటీకి చెందిన ఏడుగురు మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఉదంటి ఏరియా కమాండర్ సునీల్, అదే డివిజన్ కార్యదర్శిగా వ్యవహరించిన అతని భార్య అరినా కూడా ఉన్నారు. వీరిద్దరిపై చెరో రూ. 8.00 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మొత్తం కేడర్ పై రూ. 37.00 లక్షల నగదు రివార్డు ఉంది.
హర్యానాలోని యమునానగర్‌లో నిషేధిత మావోయిస్ట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అయినటువంటి శివాలిక్ జనసంఘర్ష్ మంచ్‌లో 2004లో చేరడంతో మావోయిస్టు నెట్‌వర్క్‌లోకి సునీల్ ప్రయాణం ప్రారంభమైంది. ఈ టీం ద్వారా ఢిల్లీలో కేంద్ర కమిటీ సభ్యులు లంకా పాపరెడ్డి, సుబ్రమణ్యం వంటి సీనియర్ మావోయిస్టు సిద్ధాంతకర్తలతో సునీల్ కు పరిచయం ఏర్పడింది, అక్కడ అతను మావోయిస్టు ఫిలాసఫీపై అవగాహనను పెంచుకోవడంతోపాటు పట్టణ నెట్‌వర్క్‌లో పనిచేయడం ప్రారంభించాడు. ఇటువంటి తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు సునీల్‌ను 2006, 2008లో రెండుసార్లు పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత సునీల్ తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాడు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు కేడర్ తో తన పరిచయాలను బలోపేతం చేసుకున్నాడు.

డిసెంబర్ 2015లో హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీలో మావోయిస్టు నాయకుడు మన దీప్‌తో జరిగిన యాదృచ్ఛిక సమావేశం సునీల్ జీవిత గమనాన్ని మార్చేసింది. ఇద్దరూ కలిసి ఒడిశాలోని నువాపాడ జిల్లాలోని బోడెన్ (ఖడుపాని) అడవివైపు ప్రయాణించారు, అక్కడ సునీల్ మావోయిస్టు సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడు సంగ్రామ్ అలియాస్ మురళిని కలిశాడు. ఈ సమావేశం తర్వాత, అతను అధికారికంగా సాయుధ కేడర్‌లో చేరాడు. తర్వాత గరియాబంద్-నువాపాడ సరిహద్దు జోన్‌లో కార్యకలాపాలు ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలోనే 2016 మే నెల నాటికి సునీల్ అంకితభావాన్ని గుర్తించిన పార్టీ నాయకత్వం అతనికి సినాపాలి ఏరియా కమిటీ సభ్యునిగా (ACM) అవకాశాన్ని కల్పించింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ లో సునీల్ గరియాబంద్‌ను సందర్శించినప్పుడు మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గణపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను సహా అగ్ర మావోయిస్టు నాయకులతో కలిసి వెళ్లినప్పుడు అతని పాత్ర మరింత పెరిగింది. కుందాంఝరియా గ్రామంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్ సునీల్ ప్రమేయం, ప్రభావాన్ని బహిర్గతం చేసింది.
ఈ పరిణామాల్లోనే 2018 జనవరిలో కుందాంఝరియా అడవిలో సునీల్ వారం రోజులపాటు పార్టీ కేడర్ కు వ్యూహాత్మక, ఆయుధ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం గెరిల్లా యుద్ధం, కమ్యూనికేషన్ కోడ్, ఆకస్మిక వ్యూహంపై దృష్టిని సారిస్తూ శిక్షణనిచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ సందర్భంలోనే, ఇక్కడే అతను తోటి మావోయిస్టు అరినా టెకమ్‌ను కలిశాడు. ఆ తర్వాత ఆమెను 2018 మే నెలలో పెళ్లి చేసుకున్నాడు. తన నాయకత్వానికి పార్టీలో మంచి గుర్తింపు పొందిన సునీల్ జూలై 2018లో డిప్యూటీ డివిజనల్ కమిటీ సభ్యుడిగా (DVCM) పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2020 డిసెంబర్ లో ఇందగావ్ ఏరియా కమాండర్‌గా నియమితుడయ్యాడు, ఆ పదవిలో అతను లొంగిపోయే వరకు ఉన్నాడు.

ఇలా వరుసగా పార్టీలో తన నాయకత్వ ప్రతిభను చాటుకున్న సునీల్ 2022 జూలై నెలలో ఓధ్ అనే గ్రామ అటవీ ప్రాంతంలో సీనియర్ సెంట్రల్ కమిటీ సభ్యులు దేవ్ జీని, చలపతిని, వికాస్, జైరామ్, కార్తీక్‌లతో కలిసి ఒక కీలకమైన మావోయిస్టు నాయకత్వ సమావేశానికి హాజరయ్యాడు. ఈ దృశ్యం సునీల్ ఉద్యమ సోపాన క్రమంలో అతని ఉన్నత స్థితిని స్పష్టం చేసిందనే చెప్పాలి. అటువంటి కీలక నేతలతో సమావేశమైన సునీల్ సైతం శుక్రవారం ప్రభుత్వానికి లొంగిపోవడం గమనార్హం. ఇతని లొంగుబాటు గరియాబంద్ ఏరియాలో మావోయిస్టు అవశేషాలు కూడా లేకుండా చేసినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కాగా గడచిన 2001-2025 సంవత్సరాల మధ్య ఛత్తీస్ గఢ్ వ్యాప్తంగా మొత్తం 7,826 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇందులో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,319 మంది లొంగిపోయారు. గడచిన రెండు దశాబ్ధాలలో ఇది అత్యధికం. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు 209 మంది సహచరులతో కలిసి 175 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ గల నెల 17వ తేదీన లొంగిపోయిన ఘటన ఉద్యమ చరిత్రలో అతిపెద్ద ఘటన.

