(– డా. మహ్మద్ రఫీ)
ఇది ముమ్మాటికీ భాషను అవమానించడమే! నిండు సభలో రాష్ట్ర మాతృ భాషను కించపరచడమే! శాసన సభాపతి, ముఖ్యమంత్రి, శాసన సభ వ్యవహారాల మంత్రి నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు అందరూ ఏకకంఠంతో ఖండించి ఆ మాటను రికార్థుల నుంచి తొలగించి ఉంటే బావుండేది! అక్బరుద్దీన్ తన తప్పును తెలుసుకున్నారు! వెంటనే క్షమాపణ చెప్పుకున్నారు హుందాతనంగా! అది వేరే విషయం!
“నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు తెలుగు రాదు. సీతక్కకు తెలుగు మాత్రమే వచ్చు, హిందీ ఇంగ్లీష్ రాదు” అని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (MIM) పార్టీ శాసనసభ నేత అక్బరుద్దీన్ ఓవైసీ తాజా బడ్జెట్ సమావేశాల్లో ఎద్దేవా చేశారు! ఇంగ్లీష్, హిందీ రాకపోవడం సిగ్గు పడాల్సిన విషయమా? ఏ భాష నేర్చుకోవాలనేది వారి వారి ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. పార్లమెంట్ లోను ఇంగ్లీష్, హిందీ రాని సభ్యులు చాలామంది ఉన్నారు. అందుకేగా ఆటోమెటిక్ ట్రాన్స్ లేషన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మన శాసనసభలోనూ ఆ సౌకర్యం వుంది. పొరుగు భాష, ప్రవాస భాష రాకపోవడం ఏదో పెద్ద తప్పు అయినట్లు, మంత్రిగా ఆమెకు తానేం మాట్లాడుతున్నానో అర్ధం కావడం లేదని అక్బరుద్దీన్ అన్నారు. ఆమె తప్పుగా అర్ధం చేసుకున్నారని అవమానించారు. నిజానికి ఆమె సరిగా అర్ధం చేసుకునే సమాధానం ఇచ్చారు. ఇక్కడ అర్ధం కానిది అక్బరుద్దీన్ కే! ఎందుకంటే ఆయనే చెప్పుకున్నారు తెలుగు రాదని. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు రాదని ఒక సీనియర్ ప్రజా ప్రతినిధి చెప్పుకోవడమే పెద్ద సిగ్గు చేటు.
అక్బరుద్దీన్ కు అద్భుతంగా ఆంగ్లం మాట్లాడటం వచ్చి ఉండొచ్చు. కానీ, ఆయన విద్యార్హత ఇంటర్ మాత్రమే! ఇంటర్ పూర్తి చేసి ఎంబీబీఎస్ లో చేరి రెండేళ్ల తరువాత డుమ్మా కొట్టేశారు. సీతక్క పదవ తరగతి చదివి పూలన్ దేవి స్ఫూర్తితో జనశక్తి పార్టీలో నక్సలైట్ గా మారి కామ్రేడ్ అయ్యారు. నందమూరి తారక రామారావు పిలుపుతో జన జీవన స్రవంతిలోకి వచ్చి ఎల్ఎల్ బి పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో “గిరిజనుల వెనకబాటు” అంశంపై పరిశోధన చేసి 2022లో డాక్టరేట్ పొందారు. అంటే, ఇక్కడ విద్యార్హత చూసుకుంటే అక్బరుద్దీన్ డిస్కంటిన్యూ మెడికల్ స్టూడెంట్. డాక్టర్ సీతక్క పిహెచ్ డి స్కాలర్. ఎవరు ఎక్కువ.. ఎవరు తక్కువ?
అక్బరుద్దీన్ ఆరు సార్లు చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీనియర్ ప్రజా ప్రతినిధి కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు ప్రొటెమ్ స్పీకర్ గా అవకాశం కల్పించారు. తెలుగు రాదని ఎవ్వరు పక్కన పెట్టేయలేదు. సీతక్క మూడు సార్లు ములుగు నుంచి గెలిచారు. తెలుగు దేశం పార్టీలో ఒకసారి , కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా కీలక బాధ్యత పోషిస్తున్నారు. ఎన్ని సార్లు గెలిచామన్నది ముఖ్యం కాదు. మంత్రి అయ్యామా లేదా అన్నదే ప్రజా ప్రతినిధిగా విజయ సంతకం. ఆ సంతకం చేసే అవకాశం అక్బరుద్దీన్ కు రాలేదు, రాదు! ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకు మద్దతుగా నిలిచి కావలసిన పనులు చేయించుకోవడమే అక్బరుద్దీన్ పని. ఆ విధంగా మాత్రమే ఆయన సక్సెస్. ఇంగ్లీష్, హిందీ అర్ధం కావడం లేదని ఆయన భావిస్తున్న సీతక్క ఏ విధంగా చూసుకున్నా ఆయన కన్నా ఒక మెట్టు పైనే ఉన్నారు. ఆయన ఓల్డ్ సిటీకి, అందునా ముస్లిం వర్గానికి మాత్రమే పరిమితం. ఆమె తెలంగాణలోని అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ లెక్కన చూసుకున్నా ఆమెదే పైచెయ్యి.
మొదటి నుంచి కూడా అక్బరుద్దీన్ దూకుడు నేత. దుందుడుకు నాయకుడు. ఆయన దూకుడుకు ఒక్కోసారి అన్న అసదుద్దీన్ కూడా భయపడుతుంటారు. వారి తండ్రి సలావుద్దీన్ ఓవైసీ కీలక నేత. ఆయన వారసత్వ రాజకీయంతోనే అక్బరుద్దీన్ కు వరుస విజయాలు. వివాదాలు సృష్టించడం, ప్రతిసారి ఇరుకున పడటం అక్బరుద్దీన్ కు కొత్త ఏంకాదు. 2012లో నిర్మల్ లో చేసిన వివాదాస్పద ప్రసంగం ఇంకా ఆరని గాయమే.
ధనసరి అనసూయ అలియాస్ సీతక్క అలా కాదు. వెనకబడిన అటవీ గూడేల్లో గిరిజనుల కోసం, కుల వివక్ష వ్యతిరేకత, అణచివేతపై చిన్నప్పటి నుంచి పోరాటం చేస్తున్న నేత. పేదల పాలిట పెన్నిధిగా, ఆదివాసీ గిరిజన నాయకురాలిగా, అండగా వుండే అక్కగా సేవలు అందిస్తూ వచ్చారు. రాజకీయాల్లోను తనదైన గుర్తింపు పొందారు. కరోనా సమయంలోనూ గిరిజనులకు విశేష సేవలు అందించారు. ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రజా సేవకు భాష ప్రధానం కాదు! మాతృ భాషలో జీవోలు వస్తున్నాయి. కోర్టు తీర్పులు వెలువడుతున్నాయి. ధారాళంగా ఆంగ్లం లేదా హిందీలో మాట్లాడకపోవడం నేరం కాదు. సుందరమైన తెలుగు భాషలో ఆమె చక్కగా మాట్లాడతారు. కావాలని వివాదాలు తెచ్చుకోరు. మాతృ భాషను గౌరవించడం అంటే కేవలం తెలుగు భాషా దినోత్సవం రోజు గుర్తు చేసుకోవడం కాదు. అవసరం వున్న ప్రతి చోట తెలుగు భాషలో మాట్లాడుకోవడం. దుకాణాలకు ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ బోర్డులు తగిలించడం. ముఖ్యంగా చట్ట సభల్లో మనదైన తెలుగు భాషలో మాట్లాడుకోవడం. ఇక్కడ సిగ్గు పడాల్సింది సీతక్క కాదు. తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు రాని అక్బరుద్దీన్. మూడు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రంలో ప్రజా ప్రతినిధిగా ఉండి కూడా తెలుగు నేర్చుకోని అక్బరుద్దీన్ సిగ్గుపడాలి. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. తప్పు చేసి క్షమాపణలు చెప్పినా సరే తప్పు తప్పే!

