(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
‘లాగుల తొండలిడ్సి కొడ్త బిడ్డా.. నా సంగతి తెల్వది’.. అంటూ నిన్న నారాయణపేట జిల్లా కోస్గి సర్పంచుల సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్య ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గల ఓ నాయకుడి నోటి నుంచి వెలువడాల్సిన పదమేనా ఇది? అనే ప్రశ్నపైనా భిన్నాభిప్రాయాలున్నాయనేది వేరే విషయం. ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండేస్తా..’ అనే తరహాలో కొందరు బీఆర్ఎస్ నాయకుల పరిభాషకు తగిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి బదులిస్తున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఇదంతా వేరే చర్చ. కానీ ఇంతకీ ఆ లాగు ఏమిటి? అందులో తొండలు విడవడం ఏమిటి? ఇదీ ఇప్పటి తరానికి తెలియని అత్యంత ఆసక్తికర ‘ఇంటరాగేషన్’ కథ.

బ్రిటిష్ కాలంనాటి అత్యంత పాశవిక శిక్షగా ‘లాగులో తొండల’ కథగా పెద్దలు చెబుతుంటారు. పూర్వకాలంలో అదే పద్ధతిని మన పోలీసులు కూడా పాటించేవారనే ప్రచారం ఉన్నప్పటికీ, దానికి ఎటువంటి చారిత్రక ఆధారం లేదు. ఇక అసలు విషయంలోకి వెడితే.. లాగు అంటే మన నిక్కర్ గా భావిస్తాం. వర్తమానంలో దీన్ని అంగ్లంలో ‘షార్ట్’గా వ్యవహరిస్తున్నారు. కానీ వెనకటి కాలంలో పొట్టి లాగు, పొడుగు లాగు..లుగా ప్రస్తుత ‘షార్ట్’, ప్యాంట్ వస్త్రాలను వ్యవహరించేవారు. నిక్కర్లు ధరించే చండ్ర పుల్లారెడ్డి గ్రూపు నక్సల్స్ ను ‘పొట్టి లాగులోళ్లు’గా, ప్యాంట్లు ధరించే ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ, అప్పటి పీపుల్స్ వార్ పార్టీ తీవ్రవాదులను ’పొడుగు లాగూలోళ్లు’గా గ్రామాల్లో సంబోధించేవారు.

ఈ నేపథ్యంలోనే బ్రిటిష్ కాలంలో నిర్బంధించిన వ్యక్తుల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ‘పొడుగు లాగు’లను వారికి తొడిగించి, కాలు కింది భాగాన తాడుతో ప్యాంటును కట్టేసి, ఉదర భాగం నుంచి లాగులోకి తొండలు విడిచేవారు. దీంతో బయటకు వెళ్లే మార్గంలేక ప్యాంటులోకి, అంటే లాగులోకి విడిచిన తొండలు అత్యంత వేగంగా పైకీ, కిందకీ పరుగెడుతూ, తప్పించుకునే ప్రయత్నంలో వాటి పదునైన గోళ్లతో రక్కుతుండేవి. వాటి గోళ్ల ధాటికి రక్తం వచ్చేలా గాయాలు అయ్యేవని చెబుతుంటారు. దీంతో తొండల కదలికలను, వాటి రక్కుడు హింసను భరించలేక కడుపులోని సమాచారమంతా కక్కేవారని పెద్దలు చెబుతుండేవారు.

వివిధ కేసుల్లో నిందితులైన వ్యక్తుల నుంచి, ముఖ్యంగా దొంగలు, దోపిడీదారుల నుంచి చోరీ సొత్తు రికవరీ సమాచారం రాబట్టేందుకు సైతం మన పోలీసులు కొంతకాలం ‘లాగులో తొండలు’ పద్ధతులను అవలంభించారనే కథలు ప్రచారంలో ఉండేవి. ముఖ్యంగా 1960, 1970 దశకాల్లో ఇటువంటి పద్ధతుల ద్వాారా కరడుగట్టిన నేరచరిత్రగలవారి నుంచి విలువైన సమాచారం రాబట్టేందుకు ‘ఇంటరాగేషన్’లో పాటించేవారనే కథనాలు వ్యాప్తిలో ఉండేవి. తొండలు మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో ఎలుకలను కూడా వదిలేవారని అప్పట్లో పెద్దలు కథలు, కథలుగా చెబుతుండేవారు.

ఈ తరహా ‘ఇంటరాగేషన్’ పద్దతి ‘థర్డ్’ డిగ్రీ విధానాలకన్నా అత్యంత హింసాత్మకంగా భావిస్తుంటారు. థర్డ్ డిగ్రీలో చెక్కలు ఎక్కించడం, మలద్వారంలో బీరు సీసాలను జొప్పించడం వంటి పద్ధతులకన్నా ‘లాగులో తొండలు, ఎలుకలు విడిచి’ నిర్వహించే ఇంటరాగేషన్ తో నిందితులు విలవిలలాడుతూ సమాచారం కక్కేవారని చెబుతుంటారు. కాగా ‘లాగులో తొండలు’ అనే అంశంపై రిటైర్డ్ పోలీసు అధికారి సాధు ప్రతాపరెడ్డిని ‘సమీక్ష’ కదిలించగా, బ్రిటిష్ కాలంలో అటువంటి పద్ధతులు ఉండేవని, మన పోలీసులు ఎన్నడూ ఈ తరహా విధానాలను ఇంటరాగేషన్ లో అనుసరించలేదన్నారు. ఈ పద్ధతుల్లో నిందితులను కొట్టాల్సిన అవసరం కూడా లేదని, లాగులో విడిచే తొండలు, ఎలుకల కదలికలకే భీతావహానికి గురవుతారని ఆయన పేర్కొన్నారు. ఇదీ కేటీఆర్ ను ఉద్ధేశించి సీఎం రేవంత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలోని ‘లాగులో తొండలు’ అసలు కథ!

