Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

రక్షణ పోలీసుల వల్ల కాదట! తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని మహిళా లెక్చరర్ దరఖాస్తు!!

ఆపద సమయంలో క్షణాల్లోవచ్చి మహిళలను రక్షించడం పోలీసుల వల్ల అవుతుందని తాను నమ్మడం లేదని, తనకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని ఓ మహిళా లెక్చరర్ వరంగల్ పోలీస్ కమిషనర్ కు శనివారం దరఖాస్తు చేశారు. తనకు ఎందుకు గన్ లైసెన్స్ అవసరమనే విషయాన్ని ఆమె వివరిస్తూ, పోలీసు కమిషనరేట్ కు ఈ మెయిల్ చేశారు. ప్రియాంకారెడ్డి ఘటన నేపథ్యంలో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ గన్ లైసెన్స్ కోసం లెక్చరర్ రాసిన ఆ దరఖాస్తు పూర్తి పాఠం దిగువన చదవండి.

శ్రీ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ గారు, IPS,

కమిషనర్ ఆఫ్ పోలీస్,

వరంగల్ పోలీస్ కమిషనరేట్

విషయం: ఆయుధ చట్టం 1959 ప్రకారం ఆత్మరక్షణకు రివాల్వర్ లైసెన్స్ మంజూరుకు విజప్తి.

సర్,

మహిళలపై హింసకు సంబంధించి ఇటీవల నా చుట్టూ జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేసుకుంటున్న నాకు బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఉద్యోగం కోసం నేను ప్రతిరోజు వరంగల్ నుంచి ఖమ్మంకు ఒంటరిగా ప్రయాణిస్తాను. తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుంది. ఈనెల 28న మానస హత్య జరిగిన ప్రాంతం హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్స్ ప్రాంతం మా ఇంటి సమీపంలోనే ఉంది. నేను ప్రతిరోజు అదే మార్గంలో ప్రయాణిస్తాను. ఆ వార్త చదివినప్పటి నుంచి నేను ఇంటికి సురక్షితంగా వస్తానా? అన్న భయం ప్రతిరోజు వెంటాడుతోంది.

హైదరాబాద్ లో ప్రియాంకరెడ్డి, వరంగల్లో మానసకు జరిగింది రేపు ఎవరికైనా, ఎప్పుడైనా జరగవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేసినా, మొబైల్ యాప్ ద్వారా తక్షణ సహకారం కోరిన వెంటనే క్షణాల్లో ప్రత్యక్షమై పోలీసులు రక్షిస్తారని నేను నమ్మడం లేదు. పోలీసు శాఖపై నమ్మకం లేక ఇలా చెప్పడం లేదు.

ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి కాపాడడం అనేది పోలీసింగ్లో ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాలుగా పేరుగాంచిన ఇంగ్లాండ్, కెనడా, నెదర్లాండ్స్ దేశాల్లోనే సాధ్యం కాలేదు. అలాంటప్పడు వరంగల్లో సాధ్యం అవుతుందని అనుకోవడం అత్యాశ అవుతుంది.

ఆపదలో నన్ను నేను కాపాడుకోలేనప్పుడు నా ఉన్నత చదువులకు, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు ఇక విలువ ఏముంటుంది? మానవ మగాల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్ కలిగి ఉండడమే ఏకైక సురక్షిత మార్గం అని నేను నమ్ముతున్నాను. మీరు రివాల్వర్ లైసెన్స్ నిరాకరిస్తే…సురక్షితంగా ఉండాలంటే ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో.

దయచేసి నా ఆత్మరక్షణ కోసం The arms act. 1959 and rules ప్రకారం నాకు రివాల్వర్ లైసెన్స్ మంజూరు చేయాలని విజప్తి చేస్తున్నాను.

నౌషిన్ ఫాతిమా, MCA, M.Tech,

లెక్చరర్, ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్

E-mail: nousheenfathima@gmail.com

Popular Articles