Top 5 This Week

Related Posts

ఆ బస్సుది ‘డేంజరస్’ చరిత్రే..!

హైదరాబాద్: కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున 20 మందికిపైగా దుర్మరణం చెందిన ప్రమాద ఘటనలో కాలిపోయిన ప్రయివేట్ బస్సు చరిత్ర అత్యంత ‘డేంజరస్’గా ఉన్నట్లు తెలుస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సును డామన్ డయ్యూ కేంద్రంగా 2018 మే 2వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. హైదరాబాద్ నుంచి గత రాత్రి బెంగళూరుకు బయలుదేరిన ఈ బస్సుపై కేవలం తెలంగాణా రాష్ట్రంలోనే 16 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయట. ఇందుకు సంబంధించి రూ. 23,120 మొత్తం జరిమానాగా చెల్లించాల్సి ఉందని పోలీసు, రవాణా శాఖ రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. నిరుడు జనవరి 27వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ బస్సు పదహారుసార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. నో ఎంట్రీ జోన్ లోకి తొమ్మిదిసార్లు ప్రవేశించినందుకు జరిమానాలకు బస్సు గురైంది.

అంతేకాదు హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ కారణాలుగా బస్సుపై పలు చలాన్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ఇద్దరు డ్రైవర్లు పరారైనట్లు వార్తలు రావడం ఈ సందర్బంగా గమనార్హం. అయితే ఓ డ్రైవర్ ఇప్పటికే తమ అదుపులో ఉన్నట్లు, మరో డ్రైవర్ ఆచూకీ తెలియాల్సి ఉందని పోలీసులు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇదే దశలో బస్సు ఫిట్ గానే ఉందని, ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్ లోనే ఉన్నట్లు రవాణా శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Popular Articles