Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ కూనంనేని

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో మూడు రోజులపాటు జరిగిన పార్టీ 4వ రాష్ట్ర మహాసభల్లో కూనంనేని రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో జన్మించిన కూనంనేని తిరుపతిలో ప్రాథమిక విద్యను, గుంటూరులో డిగ్రీ పూర్తి చేశారు. విశాలాంధ్రలో పత్రికలో జర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. హైదరాబాదు నుంచి కొత్తగూడెం పట్టణానికి విశాలాంధ్ర విలేకరిగా వచ్చారు.

పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1987లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో కొత్తగూడెం ఎంపీపీగా ఎన్నికయ్యారు. కొత్తగూడెం డివిజన్ పార్టీ కార్యదర్శిగా, రైతు సంఘం జిల్లా అధ్యక్షునిగా కూనంనేని పనిచేశారు. అనంతరం 2004 నుంచి 2009 వరకు సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రెండు దఫాలు పనిచేసిన ఆయన 2022లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సీపీఐ మూడవ మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వత 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీపీఐ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం పార్టీ విస్తరణే లక్ష్యంగా పని చేయనున్నట్లు తెలిపారు. కాగా మహమ్మద్ మౌలానా సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా తిరిగి రెండోసారి ఎన్నికయ్యారు.

Popular Articles