Top 5 This Week

Related Posts

డీజీపీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు: ‘పోలీస్ సంఘం’ సీరియస్

హైదరాబాద్: తెలంగాణా డీజీపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలపై పోలీసు వర్గాలు మండిపడుతున్నాయి. డీజీపీని ఏకవచనంతో సంబోధిస్తూ కేటీఆర్ వాడిన పరుష పదాలపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు తెలంగాణా పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పై ఎమ్మెల్యే కేటి రామారావు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేటిఆర్ ఒక వార్తా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయని ఆయన అన్నారు. డీజీపీ నాయకత్వంలో ఎన్నడూ లేనంత అప్రమత్తతతో తెలంగాణ పోలీసులు పని చేస్తున్న విషయం ప్రజలకు తెలుసని, తాము చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు.

ఓ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడినప్పటి చిత్రం

పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పని చేస్తుందని, శాంతి భద్రతలు కాపాడడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కేటీఆర్ ప్రస్తావించిన అన్ని సంఘటనల్లో పోలీసులు చట్ట ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారన్నారు. దోపిడీ, హత్యల కేసుల్లో అత్యంత వేగంగా నిందితులను పట్టుకున్నామన్నారు. పోలీసుల పనితీరులో ఆక్షేపించవలసింది ఏమీ లేదున్నారు. ఒకవేళ ప్రశ్నించవలసివచ్చినా సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని గుర్తు చేస్తున్నామన్నారు.

రాజకీయ ప్రేరేపిత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అభ్యంతరకర భాషలో రాష్ట్ర డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని కేటి రామారావును డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణా పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.

Popular Articles