కంచ గచ్చిబౌలి భూముల అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ తరపున కేంద్ర దర్యాప్తు సంస్థలకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రిజర్వు బ్యాంకు గవర్నర్, సెబీ, సీబీఐ, సీవీసీ, ఎస్ఎఫ్ఐవో సహా మొత్తం ఐదు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణా భవన్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెర తీసిందని, సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు స్కెచ్ వేశారని, రూ. 10 వేల కోట్ల కుంభకోణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మొత్తం వ్యవహారంలో ఓ బీజేపీ ఎంపీ హస్తముందని, క్విడ్ ప్రో కో తరహాలో బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఆ బీజేపీ ఎంపీ ఎవరనేది తాను ఇప్పుడే చెప్పనని, తర్వాత ఎపిసోడ్ లో బహిర్గతం చేస్తానన్నారు.

దేశ ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండానే ఇదంతా జరుగుతున్నట్లు తాను నమ్ముతున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. తాను ఫిర్యాదు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించకుంటే రేవంత్ రెడ్డి ప్రబుత్వంతో బీజేపీ కుమ్ముక్కయినట్లు భావిస్తామన్నారు. ఆయా పరిణామాల్లో అంతిమంగా ఈ విషయాన్ని తాము ప్రజాక్షేత్రంలోకి తీసుకువెడతామని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని తాము వదిలిపెట్టబోమన్నారు.