Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

డిప్యూటీ సీఎం సహా ఖమ్మం మంత్రులపై కేటీఆర్ తీవ్ర ఆరోపణ

ఖమ్మం: ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్ లో గల డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులూ కమీషన్లు వసూల్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒక మంత్రి కాదు, ఈ జిల్లాలో అందరు మంత్రులూ 30 శాతం టాక్సులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వమని, సర్వే.. సర్వత్రా అందిరినీ మోసం చేసిన ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. బాంబులేటితోపాటు తుమ్మల కూడా అదే పనిలో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముగ్గురు మోసగాళ్లని, మొనగాళ్లు కాదని కేటీఆర్ మంత్రులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళన సభలో ప్రసంగించారు.

కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి తరహాలో ప్రభుత్వాన్ని అప్పగిస్తే ఏమీ చేయలేకపోయారని కేటీఆర్ అన్నారు. ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమీషన్ల కోసమే జిల్లాలోని ముగ్గురు మంత్రులు పనిచేస్తున్నారని అన్నారు. ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు మినహా ఈ ప్రభుత్వం పీకిందేమీ లేదన్నారు. యూరియా గురించి మాట్లాడుతూ, షాపులో లేకుండా యాప్ లో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు నదీ జలాలపై అవగాహన లేదన్నారు. నదులు, నీళ్ల గురించి తెలియని సీఎంను చూస్తుంటే జాలి కలుగుతోందన్నారు.

కేసీఆర్ అప్పులు చేసిన మాట వాస్తవమేనని, రూ. 2.80 లక్షల కోట్లు అప్పు చేసి రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో వేశారన్నారు. ఉచిత కరెంట్ కోసం, రైతు బీమా కోసం, రుణమాఫీకోసం, గురుకుల పాఠశాలలకోసం, కళ్యాణలక్ష్మికోసం, 32 కలెక్టరేట్ల నిర్మాణం కోసం, 32 మెడికల్, నర్సింగ్ కళశాలకోసం, మిషన్ భగీరథ కోసం కేసీఆర్ ఆయా మొత్తంలో అప్పులు చేశారని ఏకరవు పెట్టారు. కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణా భవిష్యత్తు కోసమేనని నిర్వచించారు. బూతు మాటలంటే తనకిష్టముండదని, కానీ తప్పడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి నోటివెంట నుంచి వస్తున్న మాటలు వింటుంటే రక్తం మరుగుతోందన్నారు.

ఖమ్మంలో పార్టీ మారుతున్న మున్సిపల్ కార్పొరేటర్ల పరిణామాలపై కేటీఆర్ స్పందిస్తూ, ఎంత మంది కార్పొరేటర్లను ఎత్తుకుపోయినా పీకేదేమీ లేదన్నారు. ఓ మంత్రి కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఎంత మందిని ఎత్తుకుపోయినా తాము కొత్తవాళ్లను తయారు చేసుకుంటామన్నారు. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సర్పంచ్ పదవులను ఆశాజనకంగా గెలుపొందామన్నారు. ఖమ్మం జిల్లాలో గూండారాజ్యం నడుస్తోందని, కొత్త సర్పంచ్ లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో ఏడెనిమిది అసెంబ్లీ సీట్లు గెలుస్తామనే ధీమాను కేటీఆర్ వ్యక్తం చేశారు.

Popular Articles