నిజానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకుల భాష గురించి కొత్తగా సమీక్షించుకునేదేమీ లేదనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు మాత్రమే కాదు, అనేక మంది ఇతర శ్రేణి గులాబీ పార్టీ నేతల భాష కూడా దాదాపు ఒకేరకంగా ఉంటుందనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. కారు పార్టీ నేతలు వాడుతున్న ఈ ఘాటు భాషకు ఆద్యులెవరనేది అసలు ప్రశ్న కాదు. కానీ రాజకీయ నాయకుల భాష బాగుండాలని, వినసొంపుగా ఉండాలని పదే పదే పలువురు చెబుతుంటారు. పలువురే కాదు… హరీష్ రావు, కేటీఆర్ వంటి నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాషపై పలు సందర్భాల్లో ఆక్షేపించిన ఉదంతాలు ఉన్నాయి. సీఎం కాకముందు, అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో వాడిన భాష కూడా అభ్యంతరకరంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ ఇతరుల భాషపై అభ్యంతరం చెప్పిన నాయకులే.. అదే తరహా భాషను పదే పదే వాడినప్పుడే అది ప్రజల్లో మళ్లీ మళ్లీ చర్చకు దారి తీస్తుంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ వాడే భాషపై ఆ పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేటీఆర్ వాడే భాష పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోందని ‘ఆఫ్ ది రికార్డ్’గా పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావిస్తుంటారు. అయినప్పటికీ కేటీఆర్ తన భాషను మార్చుకోవడం లేదనే బాధను అన్యాపదేశంగా ఆ పార్టీ లీడర్లు వ్యక్తం చేస్తుంటారు. తన ప్రసంగాల్లో సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు, ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలపై కూడా కేటీఆర్ సంధించే ‘భాష’లోని ఘాటు వ్యాఖ్యలను గులాబీ పార్టీకి చెందిన కరడుగట్టిన కార్యకర్తలు బాగా ఎంజాయ్ చేస్తుండవచ్చు. కానీ ఇటువంటి భాషను సామాన్య జనం ఆస్వాదించడం లేదని, ఆమోదించడం లేదనే విషయాన్ని కేటీఆర్ గుర్తెరగాలనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది.

ఇంతకీ కేటీఆర్ తాజాగా తనదైనశైలి ఘాటు భాష ఎక్కడ ఉపయోగించారనుకుంటున్నారా? వాడు.. వీడు.. సన్నాసి.. చిల్లరగాడు.. అని మాత్రమే కాదు రేవంత్ రెడ్డి కేసీఆర్ ‘ఎంటికె’ కూడా పీకలేడు.. అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఎంటికె’ అనే పదానికి తెలంగాణా మాండలికంలో లోతైన నిర్వచనం కూడా ఉంది. దాని లోతుల్లోకి ఇప్పుడెందుకుగాని.., నిన్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన భాషా సౌందర్యాన్ని దిగువన గల వీడియోలో పూర్తిగా వీక్షించవచ్చు..

